Omicron Scare: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది. దాని వేగానికి అడ్డుకట్ట వేయాలంటే మనం కొవిడ్ నియమాలు పాటించాల్సిందే. అందులో మాస్క్ మరింత కీలకం. మనమంతా మాస్కులు ధరిస్తున్నప్పటికీ.. ఏ తరహా మాస్కుల వాడకం ముఖ్యమో మరోసారి నిపుణులు సూచనలు చేస్తున్నారు. వేగంగా ప్రబలే లక్షణమున్న ఒమిక్రాన్ విషయంలో సింగిల్ లేయర్(ఒక్కటే పొర) మాస్కుల వాడకపోవడమే మేలని సిఫార్సు చేస్తున్నారు.
కరోనా ప్రారంభ దశలో వైద్య సిబ్బందిని ఎన్95 మాస్కుల కొరత వేధించేది. దాంతో సాధారణ ప్రజలు క్లాత్ మాస్కులు వాడేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. అయితే ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో ప్రజలు ఎన్95, కే95 మాస్కులు వాడేలా నిపుణులు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం వాటి కొరత కూడా లేదు. మరోపక్క క్లాత్ మాస్కుల విషయంలో అలంకరణే ప్రాధాన్యంగా కనిపించడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. 'ఒమిక్రాన్ సమయంలో వాటికి చోటు లేదు. ఇదే విషయాన్ని వైద్యాధికారులు కొద్ది నెలలుగా చెప్తున్నారు' అంటూ అమెరికా చెందిన వైద్య నిపుణులు డాక్టర్ లీనా వెన్ అన్నారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు కనీసం మూడు పొరల సర్జికల్ మాస్కు వాడాలని సూచించారు. ఇవి ఇప్పుడు సులభంగానే లభ్యమవుతున్నట్లు చెప్పారు. దానిపైన క్లాత్ మాస్కు ధరించవచ్చని, ఒక్క క్లాత్ మాస్కు మాత్రమే వద్దని చెప్పారు. మొత్తంగా ఎన్95, కే95 మాస్కుల వాడకం వైపు వెన్ మొగ్గు చూపారు. అయితే వాటిని ముఖానికి సరిగా అమరేలా ధరించాలని వెల్లడించారు.
Single Layer Face mask amid Omicron Surge: