అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. ఇరుదేశాలు విధించుకున్న సుంకాలు తొలగింపుపై ఇప్పటికే రెండు దేశాలు ప్రకటించగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో వాటిపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అంత తొందరేమీ లేదని స్పష్టం చేశారు ట్రంప్. సుంకాల తగ్గింపును చైనా కోరుకుంటోందని.. కానీ అది జరగబోదని అన్నారు.
అమెరికా, చైనాల మధ్య జరిగే తొలి దఫా వాణిజ్య ఒప్పందంలో సుంకాల తగ్గింపు ఉంటుందని చైనా వాణిజ్య శాఖ చేసిన ప్రకటననూ ట్రంప్ తోసిపుచ్చారు. వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి అమెరికా కంటే ఎక్కువగా చైనా పరితపిస్తోందని వ్యాఖ్యానించారు.