తెలంగాణ

telangana

ETV Bharat / international

విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్​! - అమెరికా ఇమ్మిగ్రేషన్​ అండ్​ కస్టమ్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​

అమెరికాలో విశ్వవిద్యాలయాల పునఃప్రారంభంపై ఒత్తిడి పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకుంది అగ్రరాజ్య ఇమ్మిగ్రేషన్​ అండ్​ కస్టమ్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​. ఆన్​లైన్​ ద్వారా శిక్షణ పొందుతున్న విదేశీ విద్యార్థులను.. వెనక్కి పంపించే విధంగా నూతన నిబంధనలను జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది విదేశీ విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

New rules: Foreign pupils must leave US if classes go online
విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్​

By

Published : Jul 7, 2020, 11:53 AM IST

ఇప్పటికే హెచ్‌-1బీ వంటి పలు వీసాలు, గ్రీన్‌కార్డుల జారీపై నిషేధం విధించిన అమెరికా ప్రభుత్వం మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు భారీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైనట్లయితే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ప్రకటించింది.

"ఆన్​లైన్​లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు.. దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి. లేదా వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చే విశ్వవిద్యాలయాలకు మారాలి."

--- అమెరికా ఇమ్మిగ్రేషన్​ అండ్​ కస్టమ్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​

కరోనా వైరస్​ వల్ల అమెరికావ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. అయితే వాటిని పునఃప్రారంభించాలని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇప్పటికే అనేకమార్లు సూచించారు. కానీ వైరస్​ ముప్పు ఇంకా వీడని తరుణంలో విశ్వవిద్యాలయాలు సందిగ్ధంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో నూతన నిబంధనలు.. విశ్వవిద్యాలయాలను తీవ్ర ఒత్తిడికి గురి చేయనున్నాయి.

హార్వర్డ్​ సహా.. అనేక విశ్వవిద్యాలయాలు ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించిన రోజే ఈ నూతన నిబంధనలు జారీ కావడం గమనార్హం.

కొత్త నియమాల ప్రకారం.. విద్యార్థులు కొన్ని తరగతులకైనా వ్యక్తిగతంగా హాజరుకావాలి. పూర్తిగా ఆన్​లైన్​కే పరిమితమైన విశ్వవిద్యాలయాల్లో చేరే కొత్త విద్యార్థులకు వీసాలు మంజూరు చేయరు. రెండు విధానాలు(ఆన్​లైన్​, వ్యక్తిగత శిక్షణ) అవలంబిస్తున్న విశ్వవిద్యాలయాల్లో.. విదేశీ విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసుల్లో అనుమతి ఉండదు.

ఆందోళనలు.. విమర్శలు...

తాజా నిబంధనలతో అమెరికాలో ఉంటున్న వేలాది మంది విదేశీ విద్యార్థుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వీరందరూ కరోనా వైరస్​ వల్ల అమెరికాలో చిక్కుకుపోయి.. స్ప్రింగ్​ విద్యాసంవత్సరాన్ని ఆన్​లైన్​లోనే కొనసాగిస్తున్నారు.

తాజా నిబంధనలను విశ్లేషిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్​ సౌత్​ కాలిఫోర్నియాలోని విదేశీ విద్యార్థుల కార్యాలయం అధికారులు తెలిపారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు భయంతో తమను సంప్రదిస్తున్నట్టు వెల్లడించారు.

ట్రంప్​ ప్రభుత్వం నిర్ణయంపై ఇమ్మిగ్రేషన్​ అటార్నీ సైరస్​ మెహ్తా మండిపడ్డారు. ప్రమాదకర పరిస్థితుల్లో చదువుకోవాలని విదేశీ విద్యార్థులపై ట్రంప్​ ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపించారు.

ఈ భయంకరమైన​ నిర్ణయం వల్ల విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు కోర్సెరా, స్టాండ్​ఫోర్డ్​ కంప్యూటర్​ సైన్స్​ ఫ్యాకల్టీ సభ్యుడు ఆండ్రూ ఎన్​జీ.

భారత విద్యార్థులపై..

ట్రంప్‌ ప్రభుత్వ తాజా నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) గణాంకాల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో అమెరికాలో దాదాపు 10 లక్షల మందిపైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరి ద్వారా 2018 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు 44.7 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది. ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లేవారిలో అత్యధికులు చైనా, భారత్‌, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడాకు చెందినవారే.

అమెరికాలో ఏటా స్ప్రింగ్​, ఫాల్​లో తరగతులు ప్రారంభమవుతాయి. ఫాల్​ విద్యాసంవత్సరం సెప్టెంబర్​లో మొదలవుతుంది. అప్పటికి కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. పైగా సెప్టెంబర్​ నాటికి మరణాల సంఖ్య 1,70,000కు చేరుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details