తెలంగాణ

telangana

ETV Bharat / international

సూర్యరశ్మి పడే చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలు

చంద్రుడి ఉపరితలంలో సూర్యకిరణాలు పడే భాగంలో తొలిసారిగా నీటి జాడలను గుర్తించింది నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ). ఇప్పటివరకు చంద్రుడి ఉపరితలంలోని మంచు, నీడతో కూడిన ప్రాంతాల్లోనే నీటి అణువులు ఉంటాయని భావించారు. అయితే నాసా చేపట్టిన 'స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఆస్ట్రోనమీ' (సోఫియా) అబ్జర్వేటరీ ద్వారా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఇది అంతరిక్ష పరిశోధనల్లో కీలక పరిణామమని పరిశోధకులు భావిస్తున్నారు.

NASA's SOFIA discovers water on sunlit surface of Moon
సుర్యరశ్మి పడే చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలు

By

Published : Oct 27, 2020, 11:30 AM IST

Updated : Oct 27, 2020, 11:44 AM IST

శాస్త్రవేత్తలు అంచనా వేసినదానికంటే చంద్రుడిపై ఎన్నో రెట్లు అధికంగా నీటి ఆనవాళ్లు ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో బయటపడింది. చంద్రుడిపై సూర్యకాంతి పడే ప్రదేశంలో కూడా నీటి జాడలు ఉన్నట్లు వెల్లడికావడం అంతరిక్ష పరిశోధనల్లో కీలకపరిణామమని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాసాకు చెందిన సోఫియా(స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఆస్ట్రోనమీ) అబ్జర్వేటరీ‌ ఈ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. భూమికి అతి సమీపంలో ఉన్న ఈ ఉపగ్రహంపై ఒక్క చుక్క కూడా నీరు ఉండదని ఒక దశాబ్దం క్రితం వరకు అభిప్రాయపడేవారు. అయితే గత కొన్నేళ్లుగా చేస్తోన్న అన్వేషణ ఆ ఆలోచన తప్పని నిరూపిస్తూ వస్తోంది. తాజాగా సోమవారం నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురితమైన రెండు అధ్యయనాలు..గతంలో అనుకున్న దానికంటే సూర్యరశ్మి పడే ప్రాంతంలో నీటి ఆనవాళ్లను గుర్తించినట్లు, లూనార్ పోలార్‌ రీజియన్ ప్రాంతాల్లో శాశ్వతంగా సూర్యకాంతి పడని కోల్డ్ ట్రాప్స్‌ మంచుతో నిండి ఉన్నట్లు వెల్లడించాయి.

గతంలో చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్‌ చేయడం ద్వారా నీటి ఆనవాళ్లను కనుగొన్నా.. నీరు, హైడ్రాక్సిల్‌ మధ్య తేడాను గుర్తించలేకపోయారు. కానీ, కొత్త అధ్యయనాల్లో సూర్యరశ్మి ప్రాంతాల్లో కూడా నీరు పరమాణు రూపంలో ఉందని రుజువైంది. కాగా, ఈ సమాచారాన్ని శాస్త్రవేత్తలు స్ట్రాటోస్ఫెరిక్‌ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ ఆస్ట్రానమీ(సోఫియా)ఎయిర్‌బోర్న్‌ టెలిస్కోప్‌ ద్వారా సేకరించారు. పరిశోధకులు మరింత కచ్చితమైన తరంగదైర్ఘ్యం ఉపయోగించి చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్‌ చేశారు. అలాగే ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా స్టోర్‌ అయిందనే విషయం ముందుముందు మరిన్ని పరిశోధనల ద్వారా వెల్లడవుతుందని హవాయీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్‌, ప్లానెటాలజీకి చెందిన కేసే హొనిబాల్‌ వెల్లడించారు. కొన్ని ప్రదేశాల్లో నీరు సమృద్ధిగా ఉన్నట్లు మేం కనుక్కోగలిగితే, దానిని మానవ అన్వేషణకు వనరుగా వాడుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాగు నీరు, ఆక్సిజన్, రాకెట్ ఇంధనంగా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

కాగా, చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన జిఫ్‌ను నాసా ట్విటర్‌లో షేర్ చేసింది. 'మా సోఫియా టెలిస్కోప్‌ సాయంతో చంద్రుడిపై సూర్యరశ్మి పడే ప్రాంతంలో నీరు ఉందని మొదటిసారి కనుగొన్నాం. మట్టిలో పెన్సిల్ కొన కంటే చిన్నదిగా ఉండే గాజు పూసలాంటి నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయొచ్చని శాస్త్రవేతలు భావిస్తున్నారు' అని ట్వీట్‌ చేసింది.

Last Updated : Oct 27, 2020, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details