తెలంగాణ

telangana

నా భర్త మీకోసం పోరాడుతూనే ఉంటారు: మెలానియా

By

Published : Aug 26, 2020, 2:04 PM IST

అమెరికా ప్రజల కోసం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పోరాడుతూనే ఉంటారని ఆయన సతీమణి, అగ్రరాజ్య ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్​ అన్నారు. తన భర్తను మరోమారు అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని దేశ ప్రజలను కోరారు. రిపబ్లికన్​ పార్టీ జాతీయ సమావేశంలో భాగంగా ప్రసంగించారు మెలానియా.

Melania Trump
మెలానియా ట్రంప్​

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను మరోమారు ఎన్నుకోవాలని దేశ ప్రజలను కోరారు.. ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్​. అమెరికా ఆయన గుండెల్లో ఉందని.. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారని పేర్కొన్నారు.

రిపబ్లికన్​ పార్టీ జాతీయ సమావేశంలో భాగంగా శ్వేతసౌధంలోని రోస్​గార్డెన్​ నుంచి ప్రసంగించారు మెలానియా. రోస్​గార్డెన్​లో ప్రథమ పౌరురాలు ప్రసంగించటం ఇదే తొలిసారి.

" నా భర్తను మరో నాలుగేళ్లపాటు అధ్యక్షుడు, కమాండర్​ ఇన్​ చీఫ్​గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మన దేశానికి అవసరమైన ఉత్తమ నాయకుడు. నా భర్త నాయకత్వం గతంలో కంటే ఇప్పుడు మనకు అవసరమని నేను నమ్ముతున్నా. ఆయన సంప్రదాయ రాజకీయ నాయకుడు కాదు. ఆయన కేవలం మాటలు చెప్పరు. చర్యలు చేపట్టి, ఫలితాలు రాబడతారు. దేశ భవిష్యత్తే ఆయనకు ముఖ్యం."

- మెలానియా ట్రంప్​, అమెరికా ప్రథమ పౌరురాలు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించారు మెలానియా. సమర్థవంతమైన చికిత్స, ప్రతి ఒక్కరికి టీకా అందే వరకు ట్రంప్​ పరిపాలన విభాగం పోరాటాన్ని ఆపదని పేర్కొన్నారు. జాత్యహంకార నిరసనలపై స్పందిస్తూ.. న్యాయం పేరిట ఆస్తుల ధ్వంసం, హింసాకాండను నిలిపేయాలని, వ్యక్తి శరీర రంగును చూసి ఎలాంటి అంచనాకు రావద్దని సూచించారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

గురువారం ట్రంప్​ ప్రసంగం..

అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్​ ట్రంప్​ను ఇప్పటికే అధికారికంగా నామినేట్​ చేసింది రిపబ్లికన్​ పార్టీ. ఈ నేపథ్యంలో శ్వేతసౌధం సౌత్​లాన్స్​ నుంచి గురువారం నామినేషన్​​ అంగీకార ప్రసంగం చేయనున్నారు ట్రంప్​.

ఇదీ చూడండి:రానున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు ఎవరి పక్షమో?

ABOUT THE AUTHOR

...view details