అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన యూఎస్-భారత్ వాణిజ్య మండలి సదస్సులో పాల్గొన్న అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో... ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 'మోదీ హైతో ముమ్కిన్ హై...' అన్న భారత ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తావిస్తూ... మోదీ ఏదైనా సాధించగలరంటూ ఆ వాక్యాన్ని ప్రస్తావిస్తూ పాంపియో కొనియాడారు.
"భారత్-అమెరికా బంధం ఎంతో ముఖ్యమైనది. భారత ప్రభుత్వంతో మున్ముందు జరిపే చర్చలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు మరింత మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నా. వచ్చే వారం జరిగే నా భారత పర్యటనలో మోదీని, నూతన విదేశాంగ మంత్రిని కలవడానికి ఎదురుచూస్తున్నా. 'మోదీ హైతో ముమ్కిన్ హై...' ఈ మాటను ఎన్నికల ప్రచారాల్లో మోదీ అన్నారు. మోదీ ఏదైనా సాధించగలరు. మోదీతో చర్చలు జరపడానికి ఎదురుచూస్తున్నా."
--- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.