తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2020, 2:28 PM IST

ETV Bharat / international

తొలి దశలో మోడెర్నా టీకా సత్ఫలితాలు!

కరోనా మహమ్మారి టీకాపై మోడెర్నా కీలక ప్రకటన చేసింది. ప్రయోగ దశలో ఉన్న తమ వ్యాక్సిన్​ ప్రాథమిక క్లినికల్​ ట్రయల్స్​లో ఆశాజనక ఫలితాలిచ్చినట్లు వెల్లడించింది. ఈ పరిణామాన్ని టీకా అభివృద్ధిలో కీలక విజయంగా అభివర్ణించారు అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు ఆంటోనీ ఫౌచీ.

covid-vaccine-safe
తొలి దశలో మోడెర్నా టీకా సత్ఫలితాలు!

కరోనా వైరస్‌కు కళ్లెం వేసే టీకా కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్న వేళ అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ కీలక ప్రకటన చేసింది. ప్రయోగ దశలో ఉన్న తమ టీకా ప్రాథమిక క్లినికల్‌ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలిచ్చినట్లు మంగళవారం వెల్లడించింది. తొలిదశలో భాగంగా 45 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు తెలిపింది. కరోనాపై పోరాడే రోగనిరోధక శక్తి వీరిలో ఏర్పడినట్లు గుర్తించామని వెల్లడించింది. అలాగే ఈ టీకా సురక్షితమైనదని కూడా ప్రాథమికంగా నిర్ధరణ అయినట్లు తెలిపింది.

ఈ మేరకు 'న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌'లో తమ పరిశోధనా ఫలితాల్ని ప్రచురించింది.

రెండు డోసులు ఇచ్చిన వారిలో..

రెండు డోసుల వ్యాక్సిన్‌ అందుకున్న వారిలో కరోనా వైరస్‌ను అంతం చేయగలిగే ప్రతిరక్షకాలు(యాంటీబాడీలు) భారీ స్థాయిలో విడుదల అయినట్లు మోడెర్నా వివరించింది. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో కంటే ఎక్కువ ప్రతిరక్షకాలు వీరిలో ఏర్పడ్డట్లు వెల్లడించింది. ఎవరిలోనూ తీవ్రమైన దుష్పరిణామాలు కానరాలేదని పేర్కొంది. అయితే, కొంత మందిలో వికారం, కండరాల నొప్పులు, తలనొప్పి, చలి, టీకా ఇచ్చిన చోట నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేసింది. రెండో డోసు అందుకున్న తరవాతే వీరిలో ఈ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. అలాగే ఎక్కువ మోతాదులో డోసు ఇచ్చినవారిలోనే ఈ లక్షణాలు బయటపడ్డట్లు వివరించింది.

30వేల మందిపై..

ఈ టీకాను అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తోంది. తరువాతి దశలో భాగంగా 30 వేల మంది వలంటీర్లపై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన డోసులను సిద్ధం చేసినట్లు మోడెర్నా గత నెలలోనే ప్రకటించింది. ఈ టీకా ప్రాథమిక పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది.

కీలక మైలురాయి..

తాజా ఫలితాలపై అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి తీవ్ర దుష్పరిణామాలు లేకపోవడం కీలకమైన మైలురాయిగా ఆయన అభివర్ణించారు. సహజంగా ఏర్పడే స్థాయిలో ప్రతిరక్షకాలు ఏర్పడడం అనేది కీలకమన్నారు.

ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్​పై తుది పరీక్ష- 2020లోనే రిలీజ్!

ABOUT THE AUTHOR

...view details