కరోనాను అడ్డుకోవడానికి సరికొత్త మార్గం కనిపెట్టారా? అంటే అవునని అంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు. తాము తయారు చేసిన డ్రగ్... కరోనా వైరస్ మానవ శరీరంలోకి, కణాల్లోకి చొచ్చుకు వెళ్లకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. ఈ మందు వినియోగంలోకి వస్తే కొవిడ్-19పై చికిత్స సులభం కానుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎలా పనిచేస్తుంది?
కొత్తగా తయారుచేసిన డ్రగ్‌లో చిన్నపాటి ప్రొటీన్ లేదా పెప్టైడ్ ఉంటుంది. అది మానవ కణంపై కవచంలా ఉంటుంది. సాధారణంగా కరోనా వైరస్‌కు కొమ్ముల్లాంటి ప్రోటీన్ ముళ్లు ఉంటాయి. ఇవి ముక్కు, నోరు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించాక.. మానవ కణాలకు అతుక్కుపోతాయి. అంతేకాకుండా ఇవి వేగంగా వృద్ధి చెందేందుకు ఆ కొమ్ములు బాగా ఉపయోగపడతాయి. అయితే వైరస్‌కు ఉన్న ఆ ముళ్లు(కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్)ను మానవ కణానికి అతుక్కోకుండా చేస్తుందీ కొత్త పెప్టైడ్. ఆ వైరస్ ముళ్లను తాడులాగా కట్టిపడేసి.. నిర్జీవంగా మార్చేస్తాయి. అయితే వైరస్ ముళ్లు మానవ కణంలోని ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్2(ఏసీఈ2)కు మాత్రమే అతుక్కుంటుంది. అలా రెండూ కలిసిన ప్రాంతాన్నే 'ఆల్ఫా హెలిక్స్' అంటారు. ఆ ప్రాంతాన్ని ఈ పెప్టైడ్ కాపాడుతుంది. ఈ ఎంజైమ్ ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఉంటుంది.
కొత్త సాంకేతికతతో గంటలో...
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఐటీ) పెప్టైడ్ సింథసిస్ టెక్నాలజీ సాయంతో.. 23 అమైనో యాసిడ్లు కలిగిన పెప్టైడ్‌ను తయారు చేశారు. అమైనో యాసిడ్, ప్రోటీన్ సమూహంతో 37 సెకన్లలో ఒక పెప్టైడ్ తయారవుతోంది. 50 అమైనో యాసిడ్లు కలిపిన పెప్టైడ్ కణాన్ని తయారు చేసేందుకు గంట పడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పెప్టైడ్లను 100 విభిన్న వేరియంట్లతో తయారు చేస్తున్నారు. అతుక్కునే గుణం ద్వారా వాటిని వర్గీకరించనున్నారు. ప్రస్తుతం ఇది జంతువులపై ప్రయోగదశలో ఉన్నట్లు తెలిపారు.