వ్యాపార దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. 2008లో ఓ మహిళా ఉద్యోగిని ఫ్లర్ట్ చేసేవారు. ఆమెకు ఈమెయిల్స్ పంపేవారు. ఆయన్ని మైక్రోసాఫ్ట్ ఓ సందర్భంలో హెచ్చరించింది కూడా. ఇప్పుడు ఈ విషయాన్ని సంస్థ స్వయంగా వెల్లడించిందని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ప్రస్తుత మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు, వైస్ ఛైర్మన్ బ్రాడ్ స్మిత్.. మరో అధికారితో కలిసి ఈ విషయంపై గేట్స్‌ను అప్పట్లో కలిశారని పత్రిక పేర్కొంది. ఈమెయిల్స్‌పై వారు ఆరా తీసినట్టు వెల్లడించింది.
ఈ వ్యవహారాన్ని గేట్స్ కొట్టిపారేయలేదని, అయితే ఆ మహిళా ఉద్యోగి- వ్యాపార దిగ్గజం మధ్య ఎలాంటి లైంగిక బంధం లేకపోవడం వల్ల సంస్థ ఆయనపై చర్యలు తీసుకోలేదని వార్తాపత్రిక తెలిపింది.
ఈ కథనంపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు సంస్థ నిరాకరించింది. అయితే వాల్ స్ట్రీట్ ప్రచురించింది మాత్రం నిజమేనని సంస్థ అంగీకరించింది. అటు బ్రాడ్ స్మిత్ కార్యాలయం ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయితే బిల్ గేట్స్ వ్యక్తిగత కార్యాలయం మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. 'అసలు ఏం జరిగిందో తెలియని వారు, విషయంపై సరైన అవగాహన లేని వారి నుంచి ఈ ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదు,' అని ఓ ప్రకటనను విడుదల చేసింది.
పాల్ ఆలెన్తో కలిసి 1975లో కంపెనీని స్థాపించారు బిల్ గేట్స్. 2000వరకు సీఈఓగా పనిచేశారు. 2008 తర్వాత కంపెనీకి సంబంధించిన రోజువారీ కార్యకలాపాల నుంచి నెమ్మదిగా తప్పుకున్నారు. 2014 వరకు కంపెనీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.