తట్టు(పొంగు) వ్యాధి కారణంగా 2018లో లక్షా 42 వేల 300మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమేరకు ఓ నివేదిక విడుదల చేసింది.
బాధితులు అక్కడే ఎక్కువ..
సరైన సమయంలో టీకా వేయించడం ద్వారా తట్టును ఎదుర్కొనే వీలుంది. అయితే... టీకా ధరలు దాదాపు దశాబ్దకాలంగా ఏమాత్రం తగ్గకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విశ్లేషించింది.
పేదరికంలో మగ్గుతున్న దేశాల్లోనే తట్టు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ వివరించింది. సహారా ఆఫ్రికాలో ఈ వ్యాధితో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని తట్టు బాధితుల్లో సగం మంది లిబియా, మడగాస్కర్, సోమాలియా, ఉక్రెయిన్, కాంగోలో ఉన్నట్లు వెల్లడించింది.
పెద్ద దేశాలకూ...
తట్టు వైరస్ రహిత దేశాల జాబితాలో ఉన్న చెక్ రిపబ్లిక్, అల్బేనియా, గ్రీస్, యూకే దేశాలు 2018లో ఆ హోదాను కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అయితే... టీకా వేయించుకునేవారి సంఖ్య ఆ దేశాల్లోనూ తక్కువగా ఉందని తెలిపింది.
2018లో అమెరికాలో తట్టు కేసుల సంఖ్య 25 ఏళ్ల గరిష్ఠానికి చేరినట్లు లెక్కగట్టింది డబ్ల్యూహెచ్ఓ.
పిల్లల్లోనే అధికం....
వ్యాధి నివారణకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో కనీసం 95 శాతం మందికి టీకాలు వేయించాల్సి ఉంది. అయితే... 2018లో తట్టు నిరోధక టీకాల మొదటి డోస్ 86 శాతం, రెండో డోస్ 70 శాతం కంటే తక్కువ మంది చిన్నారులకు వేసినట్లు డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ తెలిపాయి. ఫలితంగా మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడించాయి. మృతుల్లో ఐదేళ్లలోపు చిన్నారులే ఎక్కువని వివరించాయి.
" ప్రాణాంతకమైన తట్టు వైరస్ నుంచి పిల్లలను కాపాడలేకపోవడం సమష్టి వైఫల్యమే. హానికరమైన వైరస్ నుంచి చిన్నారులను రక్షించుకోవాలి. ప్రపంచ దేశాలు నాణ్యమైన ఆరోగ్య సేవలపై దృష్టి సారించాలి. ప్రజలకు జీవితంపై భరోసా కల్పించాలి."
-టెడ్రోస్ అధనామ్ గెబ్రెసేస్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్