బైడెన్ శ్వేతసౌధంలోకి వచ్చిన కొత్తల్లో చైనా సంతోషానికి అంతులేదు. అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏకంగా చైనా పత్రికలు ట్రంపును అవహేళన చేశాయి. కానీ, బైడెన్ పాలనలో రోజులు గడిచే కొద్దీ ట్రంపే కొంతలో కొంత నయం అని చైనా భావించే పరిస్థితి వస్తోంది. చైనాను అడ్డుకోవడానికి ఎన్నిరకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ బైడెన్ కార్యవర్గం చక్కబెడుతోంది. దీంతో చైనాకు మెల్లగా ఆ నిర్ణయాల సెగ తగులుతోంది. మరోపక్క ట్రంప్ విధించిన టారిఫ్‌ల్లో ఒక్క దానిని కూడా తొలగించలేదు. ఇప్పుడు వాటికి అదనంగా.. విస్తరించిన కొత్త బ్లాక్ లిస్ట్ జాబితాను ప్రకటించారు.
ఒక్క కలం పోటుతో..
ట్రంప్ హయాంలో మొత్తం 31 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. బైడెన్ వచ్చి ఇంకా ఆరు నెలలు పూర్తికాలేదు. ఆయన మరో 28 కంపెనీలను అందులో చేర్చారు. గురువారం చైనా కంపెనీల బ్లాక్ లిస్ట్ జాబితాను విస్తరిస్తూ బైడెన్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడా జాబితాలో ఉన్న చైనా కంపెనీల సంఖ్య 59కి చేరింది. ముఖ్యంగా నిఘా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని వీటిపై ఆరోపణలు చేసింది. అంతేకాదు ఈ సంస్థలు చైనా సైన్యంతో కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఈ ఆదేశాలు ఆగస్టు 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
జాబితాలో ఉన్న కంపెనీలు..
బైడెన్ బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీలు చాలా వరకు గతంలో ప్రకటంచిన ట్రంప్ బ్లాక్ లిస్టులోనూ ఉన్నాయి. చైనా మొబైల్, చైనా యూనికామ్, చైనా టెలికమ్యూనికేషన్స్, హువావే, సెమీకండెక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ టెలికమ్యూనికేషన్స్ వంటివి ఈ సారి కూడా కొనసాగాయి. బైడెన్ రక్షణ రంగ కంపెనీలపై ఎక్కువ దృష్టిపెట్టారు. దీంతో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్, చైనా ఏరోస్పేస్ సైన్స్ ఇండస్ట్రీ, చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, చైనా ఏవియానిక్స్, చైనా శాటిలైట్ కమ్యూనికేషన్స్,కోస్టర్ గ్రూప్, ఫుజియాన్ టార్చ్ ఎలక్ట్రాన్ టెక్నాలజీ, గుయ్‌ఝూ స్పేస్ అప్లయన్స్, షాన్జీ ఝాంగ్టియన్ రాకెట్ టెక్నాలజీ వీటిలో ఉన్నాయి. 2019లో అమెరికా విధించిన ఆంక్షల దెబ్బకు హువావే మొబైల్ ఫోన్ల వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా యూకే 5జీ టెక్నాలజీ ఏర్పాటు ప్రాజెక్టు నుంచి బయటకు పంపించింది.
ఇక ఫేషియల్ టెక్నాలజీని తయారు చేసే హాంగ్‌ఝూ హిక్ విజన్ డిజిటల్ టెక్నాలజీస్‌ను దీనిలో చేర్చారు. షింజియాంగ్లో వీఘర్లపై అధికారులు నిఘా పెట్టే 'సేఫ్ సిటీ' ప్రాజెక్టులకు ఇది సహకరిస్తోంది. దీనిపై హిక్ విజన్ సంస్థ ప్రతినిధి స్పందిస్తూ "గత జాబితాకు సరైన కారణాలు చెప్పకుండా.. హిక్ విజన్ సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త కారణాలు వెతుకుతోంది. ఎందుకంటే మా హెడ్‌క్వార్టర్ చైనాలో ఉంది కాబట్టి" అని పేర్కొన్నారు.