తెలంగాణ

telangana

ETV Bharat / international

నిద్రించని నగరం ఎక్కడుందో తెలుసా? - LAS VEGAS

ప్రపంచంలోనే అందమైన నగరాల్లో అదొకటి. మానవుని అందమైన ఊహకు నిదర్శనం. రాత్రివేళలో విమానం కిటికీలోంచి.. మిలమిలా మెరిసిపోయే నగరాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎడారిలో ఓ అందమైన పుష్పంలా కనిపించే ఆ నగరం ఎక్కడుంది? ఆ విశేషాల గురించి తెలుసుకుందామా!

నిద్రించని నగరం ఎక్కడుందో తెలుసా?

By

Published : Oct 28, 2019, 5:21 PM IST

‘లాస్‌ వేగస్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది కేసినోలే. అయితే అక్కడికి జూదం కోసమే వెళ్తారు అనుకుంటే పొరబాటే. కానీ ఆ కేసినోల అందాలను మాత్రం చూసి తీరాల్సిందే. అమెరికాలోని గ్రాండ్‌ కేన్యన్‌, నయాగరా వంటివన్నీ ప్రకృతి సృష్టించిన వింతలైతే, లాస్‌ వేగస్‌ అనేది మనిషి నిర్మించిన అద్భుతం’ అంటున్నారు అనకాపల్లికి చెందిన కొయిలాడ రామ్మోహన్‌రావు.

ప్రపంచంలోనే అతి పెద్దదైన హూవర్‌ డ్యామ్‌

సిన్‌ సిటీ, సిటీ ఆఫ్‌ లైట్స్‌, ద సిటీ దట్‌ నెవర్‌ స్లీప్స్‌... ఇలా ఎన్నో పేర్లను సొంతం చేసుకున్న లాస్‌వేగస్‌ను చూడ్డానికి వెళ్లాం. రాత్రివేళలో విమానం కిటికీలోంచి మిలమిలా మెరిసిపోయే వేగస్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎడారిలో అందమైన పుష్పంగా వేగస్‌కి పెద్ద చరిత్రే ఉంది.
పదివేల సంవత్సరాలనుంచీ అక్కడ స్థానిక అమెరికన్లు ఉన్నప్పటికీ అది అభివృద్ధి చెందింది మాత్రం గత వందేళ్లలోనే. అప్పట్లో నెవాడాలో నీళ్లు లేకున్నా వేగస్‌ ఉన్నచోట భూమి పైపొరలో కొంత నీరు లభ్యం కావడంతో స్థానికులు నూతులు తవ్వి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారట. దాంతో అది పచ్చగా కనిపిస్తూ అటుగా వెళ్లేవాళ్లని ఆకర్షించడంతో దానికి వాళ్లు ఆకుపచ్చని మైదానం అనే అర్థం వచ్చేలా ‘లాస్‌ వేగస్‌’ అని పేరు పెట్టారట.

వేగస్‌కి ముప్ఫై మైళ్ల దూరంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన హూవర్‌ డ్యామ్‌ను నిర్మించడంతో దాని దశ తిరిగింది. డ్యామ్‌ వల్ల నీటికీ విద్యుచ్ఛక్తికీ కొరత లేకపోవడంతో శరవేగంగా వృద్ధి చెందింది. డ్యామ్‌ కట్టడానికి అసంఖ్యాకంగా కార్మికులు తరలివచ్చారు. వాళ్ల అవసరాల కోసం వేగస్‌లో షాపులూ రెస్టరెంట్లూ ఆఫీసులూ సినిమాహాళ్లూ... ఎన్నో వెలిశాయి. కుటుంబాలు దగ్గరలేకపోవడంతోబాటు చేతినిండా డబ్బు ఉండటంతో ఆ కార్మికులకు సినిమాల్లాంటి వినోదాలు సరిపోవని అర్థమైంది కాలిఫోర్నియా మాఫియాకి. అప్పటివరకూ లాస్‌ ఏంజిలిస్‌ పట్టణమూ అందులోని హాలీవుడ్‌ పైనా తమ ప్రభావాన్ని చూపిన డాన్లు వేగస్‌ మీద దృష్టి పెట్టారు. కేసినోలుగా పిలిచే జూదగృహాలు తెరిచారు.

విలాసవంతమైన బార్‌లూ రెస్టరెంట్లను ఏర్పాటుచేసి మిలియన్లకొద్దీ సంపాదించారు. పైగా వేగస్‌ నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండటంవల్ల పోలీస్‌ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో మాఫియాదే ఇష్టారాజ్యమైంది. అప్పట్లో అమెరికాలో మద్యపాన నిషేధం ఉండేది. దాంతో చట్టవ్యతిరేకంగా కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్నీ అమ్మాయిల్నీ తరలించి డబ్బు సంపాదించేవారు డాన్‌లు. కేసినోల్లో వ్యభిచారం విచ్చలవిడిగా జరిగేది. నేరాలూ ఎక్కువగానే ఉండేవి. చాలా ఏళ్లు మాఫియా రాజ్యమేలినా తరవాత ప్రభుత్వ కఠిన నిర్ణయాలవల్లా పోలీసుశాఖ పటిష్టం కావడం వల్లా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

అద్భుతమైన కట్టడాలు

ఎందుకంత క్రేజ్‌?

డ్యామ్‌ నిర్మాణం పూర్తయ్యాక కార్మికులంతా వెళ్లిపోవడంతో కేసినోలు మూతపడాల్సిన పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించిన కేసినో యజమానులు పర్యటకులను ఆకర్షించే పనిలో పడ్డారు. సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్‌లనూ ఇంజినీర్లనూ వేగస్‌కు రప్పించి అద్భుతమైన కట్టడాలుగా కేసినోలనూ హోటళ్లనూ నిర్మించారు. కాలక్రమంలో మాఫియాల ప్రభావం తగ్గింది. మద్యంమీద నిషేధం ఎత్తేశారు. జూదం చట్టబద్ధమైంది. లాస్‌వేగస్‌తో సహా మరో పదకొండు రాష్ట్రాల్లో మారివానా అనే మత్తు పదార్థంపై నిషేధాన్ని ఎత్తేశారు. పెళ్లి, విడాకుల నియమాలను సరళీకరించారు. ఆ కారణంవల్లే వేగస్‌లో పెళ్లి, విడాకుల సంఖ్య ఎక్కువ.

కేసినోల యజమానులు హాలీవుడ్‌ నటులూ గాయనీగాయకులతో మ్యూజిక్‌ కన్సర్ట్‌లను ఏర్పాటుచేయడంతో పర్యటకుల సంఖ్య భారీగా పెరిగింది. అదేసమయంలో 1951లో ప్రభుత్వం నెవాడాలో అణుపరీక్షలకు శ్రీకారం చుట్టింది. ఇది వేగస్‌కి దెబ్బ అనీ రేడియేషన్‌ వల్ల పర్యటకులు తగ్గిపోతారనీ భావించారంతా. కానీ ‘మా హోటల్‌ గదుల్లోంచి బాంబ్‌ విస్ఫోటనాన్నీ పుట్టగొడుగు ఆకారంలో ఎగసిపడే మేఘాల్లాంటి ఆకారాల్నీ చూడొచ్చ’ని కేసినో యాజమాన్యాలు ప్రకటించేసరికి అత్యంత ఖరీదు చెల్లించి మరీ ఆ దృశ్యాలను చూడ్డానికి ఎగబడ్డారు పర్యటకులు. అలా వేగస్‌ పర్యటక ప్రదేశంగా మారిపోయింది.

అందమైన ప్రదేశం

21 ఏళ్లు నిండాల్సిందే!

ఇక్కడ ప్రధానంగా చూడదగ్గది లాస్‌వేగస్‌ స్ట్రిప్‌. ఏడు కిలోమీటర్ల వరకూ విస్తరించిన ఆ ప్రాంతంలో రాత్రీపగలూ తేడా ఉండదు. అయితే ఇక్కడి హోటల్లో దిగాలన్నా జూదం ఆడాలన్నా ఇరవై ఒక్క ఏళ్లు నిండాలి.

రకరకాలుగా అలంకరించుకున్న అమ్మాయిలూ వాళ్లకు సంబంధించిన బ్రోకర్లూ అక్కడి వీధుల్లో తిరుగుతుంటారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ప్రాంతం ఉండదు. ఇక్కడి కేసినోలు చూడాలంటే చాలా దూరం నడవాలి. అది తెలీక హైహీల్స్‌ వేసుకువచ్చిన మహిళలు వెండింగ్‌మెషీన్లమీద నిల్చుని 20 డాలర్లు వేస్తే వాళ్ల పాదాలకు సరిపడే పలుచని చెప్పులు వస్తాయి. ఇక్కడ అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌కి అరవై అంతస్తుల ఇంటర్నేషనల్‌ లగ్జరీ హోటల్‌ ఉంది. దానికి పక్కనే మరో నిర్మాణం జరుగుతోంది.

అందమైన శిల్పాలతోనూ అద్భుత పెయింటింగులతోనూ అలంకరణ

కేసినోలా... మ్యూజియంలా..!

ముందుగా పలాజో కేసినో రిసార్ట్‌కి వెళ్లాం. అందమైన శిల్పాలతోనూ అద్భుత పెయింటింగులతోనూ అలంకరణతోనూ తీర్చిదిద్దిన ఆ కేసినోని చూస్తే మరో ప్రపంచంలో ఉన్నట్లే అనిపించింది. వీల్‌ చైర్లో కూర్చుని, ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టుకుని ఉత్సాహంతో జూదం ఆడుతోన్న పండు ముసలిని చూశాం. ఇది విలాసవంతమైన కేసినో మాత్రమే కాదు, నెవాడా రాష్ట్రంలోకెల్లా ఎత్తైన భవనం. లోపలా బయటా వెనిస్‌ నగరాన్ని ప్రతిబింబించేలా కట్టిన దీని గేమింగ్‌ ఏరియా లక్ష చదరపు అడుగుల పైనే. భవనాలను ఆనుకున్న కారిడార్ల పైకప్పులను ఫైబర్‌ షీట్లతో కప్పి అమర్చిన లైట్ల వల్ల రాత్రికీ పగలుకీ తేడా ఉండదు. కొన్ని కేసినోల్లో పై కప్పు లైటింగ్‌ మారుస్తూ అప్పుడే తెల్లవారినట్లూ సూర్యాస్తమయమై చీకట్లు అలుముకున్నట్లూ పట్టపగలే చీకటి అయిపోయినట్లూ భ్రమ కలిగిస్తుంటారు.

తరవాత సీజర్‌ ప్యాలెస్‌కి వెళ్లాం. ఇది కేసినోలన్నింటికన్నా అందమైనది. సుమారు నాలుగువేల గదులున్న ఈ సముదాయంలో అగష్టన్‌, సెంచూరియన్‌, రోమన్‌ ప్యాలెస్‌, ఆక్టావియాస్‌, ఫోరం అని పిలిచే ఐదు టవర్లు ఉన్నాయి. ఇందులో ఫాల్‌ ఆఫ్‌ అట్లాంటిస్‌, ఫెస్టివల్‌ ఫౌంటెయిన్‌... వంటి ఆకర్షణలెన్నో. రోమ్‌లోని ట్రెవి ఫౌంటెయిన్‌కి నకలూ ఉంది. ఇక్కడి స్విమ్మింగ్‌పూల్‌ చుట్టూ ఉన్న విగ్రహాలను చూస్తుంటే రోమన్‌ చక్రవర్తుల వైభవం కనిపిస్తుంది. తరవాత బెలాజియో... పోకర్‌ గేమ్‌కి ఈ కేసినో ప్రత్యేకం. వెయ్యి అడుగుల విస్తీర్ణంలో 460 అడుగుల ఎత్తులో లయబద్ధంగా సంగీతానికి అనుగుణంగా ఒకదాంతో ఒకటి అందంగా కలిసిపోతూ వయ్యారంగా పైకెగసే నీటిధారల్నీ వాటిమీద పడే రంగుల కాంతుల్నీ చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఈ కేసినో ఇటలీలోని బెలాజియో నగరానికి నమూనా. ఇందులో అడుగడుగునా ఇటాలియన్‌ శిల్పకళ ఉట్టిపడుతోంది. హాల్లో సీలింగుకి రెండువేల గాజు కళాఖండాలను అమర్చారు. వీటిని ఇటాలియన్‌ కళాకారులు చేత్తోనే తయారుచేశారట. అక్కడ ఉన్న ఫైన్‌ ఆర్ట్స్‌ గ్యాలరీనీ అబ్జర్వేటరీనీ ఇండోర్‌ బొటానికల్‌ ఉద్యానవనాన్నీ చూశాం.

లాస్​ వేగస్​ చూడదగ్గ ప్రదేశం

చచ్చేంత భయంతో..!

స్ట్రాటోస్పియర్‌ అనే కట్టడం చూడ్డానికి వెళ్లాం. 1149 అడుగుల ఎత్తున్న ఇది అమెరికాలోనే అత్యంత ఎత్తయిన అబ్జర్వేటరీ టవర్‌. ఇక్కడ 800 అడుగుల ఎత్తులో 360 డిగ్రీల్లో తిరిగే రివాల్వింగ్‌ రెస్టరెంట్లో కూర్చుని తింటుంటే థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇక్కడ రకరకాల రైడ్స్‌ ఉన్నాయి. బిగ్‌ షాట్‌ అనే రోలర్‌ కోస్టర్‌ దగ్గరకు వెళ్లాం. ఇది ప్రపంచంలోకెల్లా ఎత్తైన టవర్‌ రైడ్‌. డెబ్భై కిలోమీటర్ల వేగంతో వెయ్యి అడుగుల ఎత్తువరకూ పైకీ కిందకీ కదులుతుంటే జనం కేకలతో ఆ ప్రదేశం దద్దరిల్లిపోతుంటుంది. వెయ్యి అడుగుల ఎత్తులోని పడవల్లాంటి వాటిల్లో కూర్చుని పైకీ కిందకీ ఊగే ఎక్స్‌ స్కీమ్‌ రైడ్‌ చూడ్డానికే భయమేసింది. 900 అడుగుల ఎత్తులోకి లేచి, గుండ్రంగా తిరిగే స్ట్రాటోస్పియర్‌ ఇన్‌సానిటీ రైడ్‌లోనూ కేకలూ అరుపులూ తారస్థాయికి చేరతాయి.

అద్భుతమైన కట్టడాలు

న్యూయార్క్‌-న్యూయార్క్‌ అనే కేసినో అందాల్ని బయట నుంచే చూశాం. దాని బయట ఉండే బ్రూక్లిన్‌ బ్రిడ్జ్‌, ఎంపైర్‌ ఎస్టేట్‌ భవంతి, స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ... వంటి నమూనాలన్నీ కనువిందు చేస్తాయి. మిరకిల్‌ మైల్స్‌ షాప్‌ అనే మాల్‌ లోపల కృత్రిమ వర్షాన్ని చూశాం. అక్కడ ఉన్నట్టుండి చీకటి అలుముకుంది. ఆవెంటే ఉరుములూ మెరుపులూ మొదలై కాసేపటికి భోరున వర్షం కురిసింది. ఎంజిఎం, ప్లానెట్‌ హాలీవుడ్‌, పారిస్‌, ది మిరేజ్‌, కాస్మొపాలిటన్‌, మాండలే... ఇలా చూడదగ్గ కేసినోలు చాలానే ఉన్నాయి. వేగస్‌కి 18 మైళ్ల దూరంలో ప్రకృతి చెక్కిన ఎర్రని శిల్పాలతో కూడిన రెడ్‌ రాక్‌ కేన్యన్‌ అందాలనూ చూసి వెనుతిరిగాం. అప్పుడే అనిపించింది... రాక్‌ కేన్యన్‌ ప్రకృతి సృష్టించిన వింతయితే, వేగస్‌ మనిషి నిర్మించిన అద్భుతం అని.

ఇదీ చూడండి:దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాధినేతలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details