అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మూడో భేటీకి సిద్ధమేనని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. అమెరికా సరైన వైఖరితో వస్తే భేటీకి అంగీకారం తెలపనున్నట్లు స్పష్టం చేశారు.
అమెరికా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొనేందుకు ఈ సంవత్సరాంతం వరకూ తాను ఎదురుచూస్తానన్నారు కిమ్. వియత్నాం వేదికగా జరిగిన రెండో భేటీలో ఇరు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందమూ జరగలేదు.
పరిమిత అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే ఉత్తర కొరియాపై ఆంక్షలు సడలించాలని కోరినందున ఫిబ్రవరి నెలలో జరిగిన రెండో దశ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అయితే కొంతమేరకు మాత్రమే ఆంక్షలు సడలించాలని కోరామని కొరియా అంటోంది.
వియత్నాంలో జరిగిన రెండో భేటీలో కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి అమెరికా సిద్ధంగానే ఉందా అనే అనుమానం కలిగిందని ఉత్తరకొరియా పార్లమెంట్నుద్దేశించిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు కిమ్.
అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య మొదటిసారి గతేడాది జూన్‌లో సింగపూర్ వేదికగా సమావేశం జరిగింది. ఉత్తర కొరియాలో అణు నిరాయుధీకరణపై ఇరు దేశాధ్యక్షులు ఆ సమావేశంలో సూత్రప్రాయ ఒప్పందంపై సంతకం చేశారు. కానీ రెండో సమావేశంలోనే భవిష్యత్ పురోగతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.