అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని బైడెన్ అన్నారు. ఇటీవల క్యాపిటల్‌పై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. ఇప్పటి వరకు అమెరికా ఎన్నో సవాళ్లు అధిగమించిందని అధ్యక్షునిగా తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.
"నేను మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాను. అమెరికాను కాపాడతాను.
మీ (అమెరికన్ల) కోసం సర్వం ధారపోస్తాను. మీకు సేవ చేసేందుకు చేయగలిగినదంతా చేస్తాను. నేను శక్తి గురించి ఆలోచించడం లేదు. అవకాశాల కోసం ఆలోచిస్తున్నాను.
నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు ప్రజల మంచి గురించి యోచిస్తున్నాను. మనందరం కలిసి అమెరికా కథను లిఖిద్దాం. భయంతో కాదు ఆశతో.. విభజనతో కాదు ఐక్యతతో... చీకటితో కాదు వెలుగుతో రాద్దాం. మర్యాద, గౌరవం, ప్రేమ, పునరుత్తేజం, గొప్పతనం, మంచితనంతో అమెరికా నూతన కథను లిఖిద్దాం."