అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) పూర్తిగా ఆక్రమించడానికి ముందు.. ఆ దేశానికి సైనిక సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సంసిద్ధత వ్యక్తం చేశారు! అయితే రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులను క్రమంగా నియంత్రణలోకి తీసుకొచ్చే పటిష్ఠ ప్రణాళిక తమ వద్ద ఉందని బహిరంగంగా నిరూపించుకోవాల్సిందిగా అఫ్గాన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి(Ashraf Ghani) ఆయన షరతు విధించారు. మాజీ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ వంటి కీలక నేతలతో సఖ్యతతో వ్యవహరించాలనీ సూచించారు. తాలిబన్లు అఫ్గాన్‌ను(Afghanistan Taliban) ఆక్రమించడానికి ముందు బైడెన్-ఘనీ మధ్య చివరిసారిగా జరిగిన ఫోన్‌కాల్ సంభాషణలో ఈ విషయాలన్నీ చర్చకు వచ్చాయి. సంబంధిత వివరాలు తాజాగా బయటికొచ్చాయి.
బైడెన్, ఘనీ చివరిసారిగా ఈ ఏడాది జులై 23న ఫోన్‌లో మాట్లాడుకున్నారు. దాదాపు 14 నిమిషాల పాటు వారి సంభాషణ సాగింది. సైనిక సహాయం, రాజకీయ వ్యూహం తదితర అంశాలపై అందులో చర్చించారు.
''పరిస్థితులను నియంత్రించేందుకు మీ దగ్గర తగిన ప్రణాళిక ఉంటే.. మేం వాయుసేన ద్వారా సహాయం కొనసాగిస్తాం. అయితే మెరుగైన ప్రణాళిక ఉందని మీరు బహిరంగంగా నిరూపించుకోవాలి. సైనిక వ్యూహాల రూపకల్పనలో శక్తిమంతమైన అఫ్గానీల సహాయం తీసుకోండి. రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా ఖాన్ మొహమ్మదీ వంటివారికి తగిన బాధ్యతలు అప్పగించండి.'' అని ఘనీకి బైడెన్ సూచించారు.
అఫ్గాన్ బలగాలు పెద్దగా పోరాట పటిమను ప్రదర్శించడం లేదన్న భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దాన్ని చెరిపేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ''సుశిక్షితులైన 3 లక్షల మంది సైనికులు మీ వద్ద ఉన్నారు. తాలిబన్ ముఠా సభ్యుల సంఖ్య కేవలం 70-80 వేలు'' అంటూ ఘనీలో ధైర్యం నింపేందుకు బైడెన్ ప్రయత్నించారు. ''మీ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు రాజకీయంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా కృషిచేస్తాం. అంతేకాదు.. భవిష్యత్తులో మీ సర్కారు ఇంకా బలపడేందుకూ మద్దతిస్తాం'' అని ఘనీకి హామీ ఇచ్చారు.