ఇటలీలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 79కి పెరిగింది. సుమారు 2,500 మందికి ఈ మహమ్మారి సోకింది. ఇందులో ఎక్కువ కేసులు ఐరోపాకు చెందినవి కావడం గమనార్హం. మరో 25 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సోమవారం నుంచి ఇప్పటివరకు 27 మంది వైరస్‌కు బలయ్యారు. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోన్న వారి సంఖ్య 166 నుంచి 229కి చేరినట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి.
వైద్య సిబ్బందికి సోకిందా?
అమెరికాలో మరో వ్యక్తి మరణించగా.. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 7కు చేరినట్లు అధికారులు తెలిపారు. రోగికి చికిత్స అందిస్తోన్న సమయంలో ఆసుపత్రి సిబ్బందికి ఈ వైరస్ సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. వారిని ప్రతిరోజూ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
ఆ దేశంలో తొలి కేసు..
అర్జెంటీనాలో తొలి కరోనా కేసును గుర్తించారు. ఇటలీ నుంచి వచ్చిన 43 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడ్ని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.