తెలంగాణ

telangana

ETV Bharat / international

బాగ్దాదీపై ఉన్న రూ.177 కోట్లు అతనికే!

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ తలపై  2.5 కోట్ల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 177 కోట్ల పైనే) రివార్డు ప్రకటించింది అమెరికా. ఈ సొమ్ము ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఓ వ్యక్తికి దక్కనున్నట్లు తాజాగా అమెరికా మీడియా పేర్కొంది. ఆ ఇన్ఫార్మర్‌ బాగ్దాదీ గురించి స్పష్టమైన సమాచారమిచ్చి అమెరికా ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

ఉగ్రోన్మాది బాగ్దాదీపై ఉన్న రూ.177కోట్లు అతనికే!

By

Published : Oct 31, 2019, 5:41 AM IST

Updated : Oct 31, 2019, 7:29 AM IST

ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న కరడుగట్టిన ఉగ్రోన్మాది, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ అంతమయ్యాడు. అమెరికా సైనిక కమాండోలు జరిపిన ప్రత్యేక ఆపరేషన్‌లో అతని కథ ముగిసింది. అయితే బాగ్దాదీ తలపై అమెరికా 2.5 కోట్ల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 177 కోట్ల పైనే) రివార్డు ప్రకటించింది. ఈ సొమ్ము ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఓ వ్యక్తికి దక్కనున్నట్లు అమెరికా మీడియా తాజాగా పేర్కొంది. ఆ ఇన్ఫార్మర్‌ బాగ్దాదీ గురించి స్పష్టమైన సమాచారమిచ్చి అమెరికా ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించాడట.

అల్‌ బాగ్దాదీ ఉన్న స్థావరానికి అమెరికా బలగాలను తీసుకెళ్లేందుకు సిరియా.. ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఓ వ్యక్తిని ఇన్ఫార్మర్‌గా పెట్టుకుంది. ఆ ఇన్ఫార్మర్‌ చాలా కాలం నుంచి సిరియాలోని ఇద్లిబ్‌లో ఉన్న బాగ్దాదీ స్థావరంలోనే ఉన్నాడు. బాగ్దాదీ స్థావరం గురించి ఆ వ్యక్తి పూర్తి సమాచారం ఇచ్చినట్లు సిరియన్‌ డెమోక్రటిక్ ఫోర్సెస్‌ జనరల్‌ మజ్లూమ్‌ అబ్ది తెలిపారు. బాగ్దాదీ దాక్కొన్న కచ్చితమైన ప్రదేశం, ఆ ఇంటి లేఅవుట్‌, అక్షాంశ, రేఖాంశ వివరాలతో పాటు ఎన్ని గదులున్నాయి? ఎంతమంది కాపలా కాస్తున్నారు? సొరంగం మార్గం తదితర వివరాలు ఇచ్చాడని పేర్కొన్నారు.

ఆపరేషన్‌కు చాలా రోజుల ముందు ఆ వ్యక్తి.. బాగ్దాదీ ఉపయోగించిన లోదుస్తులు, రక్తనమూనాలను అమెరికా నిఘా అధికారులకు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నమూనాల ఆధారంగానే డీఎన్‌ఏ పరీక్షను నిర్వహించి బాగ్దాదీ మరణాన్ని అమెరికా నిర్ధారించింది. ఆపరేషన్‌ సమయంలోనూ ఆ ఇన్ఫార్మర్‌ అక్కడే ఉన్నాడట. రెండు రోజుల తర్వాత తన కుటుంబాన్ని తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ వ్యక్తి వివరాలు, జాతీయతను అధికారులు వెల్లడించలేదు. అలా బాగ్దాదీ అంతంలో కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తికే ముష్కరుడి తలపై ఉన్న కోట్ల రూపాయల రివార్డు మొత్తం లేదా రివార్డులో కొంత సొమ్ము దక్కనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Last Updated : Oct 31, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details