ప్రధాని నరేంద్రమోదీతో తన స్నేహబంధాన్ని ప్రస్తావిస్తూ భారతీయ అమెరికన్లు తనకే ఓటు వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. గత నెలలో ట్రంప్ ప్రచార విభాగం విడుదల చేసిన 'ఫోర్ మోర్ ఇయర్స్' అనే వీడియోలో మోదీ హ్యూస్టన్ సభ దృశ్యాలు ఉండటంపై అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.
"మాకు భారత్ నుంచి గొప్ప మద్దతు ఉంది. ప్రధాని నరేంద్రమోదీ కూడా మాకు మద్దతుగా ఉన్నారు. అందువల్ల భారతీయ అమెరికన్లు నాకు ఓటు వేస్తారని భావిస్తున్నా. ప్రధాని నరేంద్రమోదీ నాకు మంచి మిత్రుడు. ఆయన చాలా బాగా పనిచేస్తున్నారు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
భారత్ గొప్ప దేశం..
హ్యూస్టన్లో జరిగిన భారీ కార్యక్రమానికి మోదీని ఆహ్వానించటం గొప్ప విషయమని అన్నారు ట్రంప్. ఈ ఏడాది ప్రారంభంలో భారత పర్యటన విశేషాలను గుర్తు చేసుకున్నారు.
"కరోనా కారణంగా భారత్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. మహమ్మారి వ్యాప్తికి ముందు నేను భారత్కు వెళ్లా. అక్కడి ప్రజలు చాలా గొప్పవారు. చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. నిజంగా గొప్ప దేశం భారత్. అందుకే మీరు గొప్ప నేతను పొందారు. ఆయనో గొప్ప వ్యక్తి."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
తన కుటుంబమూ..
భారత్ అంటే తన కుటుంబం కూడా అభిమానిస్తుందని ట్రంప్ తెలిపారు. కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, సలహాదారు కింబర్లీ.. భారత్ గురించి తనలాగే ఆలోచిస్తారని వెల్లడించారు. వారికి భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
భారతీయ అమెరికన్ల ఓట్లపై దృష్టి..
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ అమెరికన్లపై డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రధానంగా దృష్టి సారించారు. కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. సాధారణంగా డెమొక్రాట్లకు మద్దతిచ్చే భారతీయ అమెరికన్లు.. ఈ సారి రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.
మోదీతో ట్రంప్ స్నేహమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఎంపికతో పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇప్పటికే అప్రమత్తమైన ట్రంప్ ప్రచార విభాగం.. డెమొక్రాట్లను మించి భారతీయుల మద్దతుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలో 25 లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లు ఉన్నారు.
ఇదీ చూడండి:'భారత్, చైనా వివాద పరిష్కారానికి సాయం చేస్తాం'