అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నేతలు జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌లకే తమ మద్దతు అని ఇక్కడి భారతీయ అమెరికన్ల ప్రతినిధులు ప్రకటించారు. తమను చక్కగా అర్ధం చేసుకున్నారని వివిధ భారతీయ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలిగా వారిరువురిని నవంబర్ 3 నాటి ఎన్నికల్లో ఎన్నుకుంటామని వారు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్‌ను నిరంతరం విమర్శిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ శత్రువని వారు స్పష్టం చేశారు. తొలుత సెనేటర్‌గా, అనంతరం ఉపాధ్యక్షుడిగా ఎదిగిన బైడెన్.. ఆదినుంచి భారతీయ అమెరికన్లకు దన్నుగా ఉన్నారన్నారు.
మాకు అలాంటి నేత కావాలి
"ట్రంప్ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న అనంతరం.. మా పిల్లలు, వారి పిల్లలకు మాకు ఉన్న విధంగా అవకాశాలు లభించవనేది స్పష్టమయింది. మాకు మా జాతిని, విలువలను, మా గొప్పదనాన్ని అర్ధంచేసుకుని మా కృషిని గుర్తించి, మాకు సమాన అవకాశాలను కల్పించే నేత కావాలి." అని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అజయ్ జైన్ భుటోరియా అన్నారు. శుక్రవారం ట్రంప్-బైడెన్‌ల మధ్య జరిగిన ఆఖరి చర్చలో.. భారత్‌కు మిత్రుడెవరో, శత్రువు ఎవరో తేలిపోయిందన్నారు. భారతీయ అమెరికన్లకు బైడెన్, హారిస్‌లతో గాఢమైన అనుబంధం ఉందని ఆయన తెలిపారు. తాజా సర్వేల్లో కూడా 80 శాతం భారతీయ అమెరికన్లు వారి పక్షానే ఉన్నట్టు వెల్లడైందని ఆయన వివరించారు.