తెలంగాణ

telangana

ETV Bharat / international

'బైడెన్​కే ప్రవాసీల మద్దతు- గుజరాతీలు మాత్రం...'

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవటానికి అభ్యర్థులు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయుల మద్దతు ఎవరికనే అంశం.. ఆసక్తికరంగా మారింది. ఫలితాలను ప్రభావితం చేయగలస్థాయిలో ఉన్న ఇండో-అమెరికన్ల మద్దతు బైడెన్​కే అంటున్నాయి సర్వేలు. అయితే, గుజరాతీలు మాత్రం ట్రంప్​ వెంటే ఉన్నారంటున్నాయి.

Indian Americans
'అధ్యక్ష ఎన్నికలు... బైడెన్​ వెంటే ప్రవాస భారతీయులు'

By

Published : Oct 5, 2020, 11:56 AM IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం దృష్టిసారించింది. ఇరువురు నేతలు.. గెలుపే లక్ష్యంగా తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన ప్రవాస భారతీయుల ఓట్లు డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్​వైపే ఉన్నాయంటోంది ఇండియాస్పోరా నివేదిక.

బైడెన్​ వైపే మొగ్గు

ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్​ మద్దతుదారుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నా... అమెరికాలోని ప్రవాస భారతీయులు భారీగా డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్​ వైపే మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, నమస్తే ట్రంప్​ వేడుక, మోదీ-ట్రంప్ మైత్రి వల్ల.. గుజరాతీలు ట్రంప్​కు అండగా నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

"చాలామంది ప్రవాసీలు డెమొక్రాట్లకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అక్కడ సమాజం ప్రమాదకరంగా మారుతోంది. శ్వేతజాతీయుల అధిపత్య ధోరణి చాలా చోట్ల మైనార్టీలను కలవరపెడుతోంది.

-ప్రొఫెసర్​ రాజన్ కుమార్, అంతర్జాతీయ అంశాల నిపుణలు, జేఎన్​యూ

అదే సమయంలో.. అధ్యక్ష అభ్యర్థుల మొదటి సంవాదంలో ఈ పెడ ధోరణి అడ్డుకోవటానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని అధ్యక్షుడిని ప్రశ్నించినప్పుడు... ఆయన సమాధానం మరిన్ని అనుమానాలను పెంచిందని చెబుతున్నారు.

ఈ అంశంపై ట్రంప్​ నోరు మెదపలేదు. సమాధానం దాటవేశారు. ఇది కేవలం మెక్సికన్లు, నల్లజాతీయుల్లోనే కాదు.. అక్కడున్న అన్ని మైనార్టీ వర్గాల్లో భయాందోళనలు పెంచుతుంది.

-ప్రొఫెసర్​ రాజన్ కుమార్, అంతర్జాతీయ అంశాల నిపుణలు, జేఎన్​యూ

అమెరికాలో ప్రధానంగా మైనార్టీలుండే టెక్సాస్​, కెంటకీ రాష్ట్రాల్లో పెరుగుతున్న హింస, వర్ణవివక్ష వల్ల రాత్రిపూట బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు తలెత్తాయని పరీశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వం వీరికి భరోసా కల్పించలేకపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బైడెన్​ వెంటే ప్రవాస భారతీయులు

నివేదికల ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల మద్దతు చూసుకుంటే..

  • బైడెన్​- 66%
  • ట్రంప్​- 28%
  • ఎటూ తేల్చుకోనివారు- 6%

అయితే, భారీ సంఖ్యలో ఓట్లను జో బైడెన్ దక్కించుకుంటారని చెబుతున్నా.. గత ఎన్నికల కంటే తక్కువే ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.

2016లో భారతీయుల మద్దతు..

  • హిల్లరీ క్లింటన్​- 77%
  • డొనాల్డ్​ ట్రంప్- 16%

ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయుల్లో..

  • 54%- డెమొక్రాట్ల మద్దతుదారులు
  • 16%- రిపబ్లికన్​ల మద్దతుదారులు
  • 24%- స్వతంత్రులు

దాదాపు 98% మంది భారతీయ అమెరికన్లు.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేస్తామని తెలిపారు.

ఇండో-అమెరికన్లలో ఆందోళన

అమెరికాలో శ్వేతజాతీయుల హింస పెరిగిపోతున్న నేపథ్యంలో.. ట్రంప్ భారత పర్యటన తర్వాత అధ్యక్షుడికి భారతీయుల్లో మద్దతు భారీగా పెరిగింది. ఇతర దేశీయుల్లా కాకుండా.. భారతీయులను ప్రత్యేకంగా చూస్తారని అభిప్రాయపడ్డారు కొందరు ఇండో-అమెరికన్లు.

కానీ, పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. శ్వేతజాతీయుల జాత్యాహంకారం కారణంగా.. వలసదారులపై దాడులు ఎక్కువయ్యాయి. కరోనా సంక్షోభంలో ట్రంప్​ ఆర్థిక నిర్ణయాలు మరింత చేటు చేశాయని వాపోతున్నారు. ఈ అంశాల మద్దతుదారుల్లో ఆందోళన పెంచుతున్నాయని.. క్రితం సారిలా ట్రంప్ వెంట ప్రవాసీలు నిలవకపోవచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.

అలాగే, ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. భారతీయులు ట్రంప్​ ఓడిపోతారనే భావనలో ఉన్నారని, అందుకే బైడెన్​వైపు మొగ్గుచూపే అవకాశాలున్నయని చెబుతున్నారు.

అయితే, ట్రంప్​-మోదీ మైత్రి బంధం ప్రభావం కారణంగా గుజరాతీలు ఎక్కువగా ట్రంప్​వైపే నిలబడే అవకాశాలున్నాయని అంటున్నారు.

భారతీయులను ఆకట్టుకునేందుకు..

ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్​ను ఎంపిక చేసుకోవటం.. భారతీయ అమెరికన్లలో బైడెన్​కు మరింత భరోసా పెంచింది. భారతీయ మూలాలున్న కమల ఎంపిక వల్ల... ప్రచారంలోనూ డెమొక్రాట్ల జోష్​ కనిపిస్తోంది.

మొత్తంగా ట్రంప్​-బైడెన్​ ఇద్దరూ.. అమెరికాలో ఉన్న 18లక్షల మంది భారతీయ ఓటర్లను ఆకట్టుకోవటంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హోరాహోరీ పోరు తప్పదని భావిస్తోన్న ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, మిషిగాన్​ రాష్ట్రాల్లో వీరి ఓట్లు కీలకంగా ఉంటాయి. ఫలితాలు ప్రభావితం చేసే స్థాయిలో... నిర్ణయాత్మక శక్తిగా ఉండే భారతీయ ఓటర్లను ఆకర్షించటం ఇద్దరు అభ్యర్థులకు ప్రాధాన్యాంశమైంది.

ఆసియా, పసిఫక్​-అమెరికన్ల గణాంకాలు లెక్కించే అప్లికేషన్ ప్రోగ్రామింగ్​ ఇంటర్​ఫేస్-ఏఏపీఐ సర్వే డేటా ప్రకారం.. అమెరికాలోని కీలక రాష్ట్రాల్లో భారత-అమెరికన్ ఓటర్ల సంఖ్య పరిశీలిస్తే..

రాష్ట్రం ఓటర్లు
ఫ్లోరిడా 87,000
పెన్సిల్వేనియా 61,000
మిషిగాన్ 45,000

ప్రస్తుతానికి సర్వేలన్నీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మద్దతు డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్​వైపే ఉందని చెబుతున్నాయి. అయితే, పోలింగ్​కు సమయం ఉండటం, ప్రచారం ఇప్పుడే ఊపందుకోవటం ఆసక్తి రేపుతున్నాయి. 2016లోనూ భారతీయులు భారీగా హిల్లరీకి మద్దతిచ్చినా... ట్రంప్​ విజేతగా నిలిచారు.

ఇదీ చూడండి:కరోనా దెబ్బతో ట్రంప్​ విశ్వసనీయతకే పరీక్ష!
ఇదీ చూడండి:ఆస్పత్రిలో ట్రంప్..సందిగ్ధంలో రిపబ్లికన్ల ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details