అమెరికా అధ్యక్షుడి బరిలో ఉన్న జో బైడెన్‌తో కలిసి కమలా హారిస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇండియన్-అమెరికన్ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కమలా హారిస్ భారత్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో అసలైన హీరోల విజయగాథలను చిన్నతనంలో చెన్నైబీచ్‌లో నడుస్తూ.. తన తాతగారు చెప్పిన విషయాలను కమలా హారిస్ గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా తన తల్లి శ్యామలా చేసిన ఇడ్లీ లాంటి కమ్మని ప్రేమ గుర్తులను కమలా హారిస్ ఈ సందర్భంగా అక్కడివారితో పంచుకున్నారు.
భారత ప్రజలకు ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన దశాబ్దాల్లో భారత్ సాధించిన పురోగతి ప్రస్తుతం ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు. 'న్యాయం కోసం చేసిన పోరాటంలో మన ప్రజలు చెప్పుకోదగిన పురోగతి సాధించారు. గత 74 సంవత్సరాల పురోగతి ప్రతిబింబిస్తోంది. మరింత మంచి భవిష్యత్తును నిర్మించడానికి మనమందరం కట్టుబడి ఉందాం. ఈ సమయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది.' అని కమలా హారిస్ ట్విట్టర్‌లో వెల్లడించారు.