ఆధునిక కాలంలో అనేక అంశాల్లో భారతదేశానిది విజయగాథేనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఆయన తన తాజా పుస్తకం 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్'లో భారత్ పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని పంచుకున్నారు. ప్రపంచాన్నే ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిగా మహాత్మాగాంధీని అభివర్ణించారు. గాంధీజీపై తనకున్న ఆరాధ్యభావానికి అక్షర రూపం కల్పించారు. బాల్యం నుంచే రామాయణ, మహాభారతాల ప్రభావం తనపై ఎంతో ఉందని వివరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పనితీరు.. సోనియా, రాహుల్‌గాంధీల మనస్తత్వాలు వంటివాటిపై తన అభిప్రాయాలను ఒబామా పూసగుచ్చారు. రాహుల్‌గాంధీ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే సోనియాగాంధీ మన్మోహన్‌కు ప్రధాని పదవిని కట్టబెట్టారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ ఉగ్రవాది లాడెన్‌ను మట్టుపెట్టిన నాటి పరిస్థితులను కూడా ఒబామా వివరించారు. పాక్ మిలిటరీకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం మార్కెట్‌లోకి వచ్చిన ఈ పుస్తకం ఒబామా తీసుకురాదలచిన రెండు సంపుటాల్లో మొదటిది. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి తొలివిడత అధ్యక్ష పదవి ముగిసేవరకు తన అనుభవాలు, జీవనయానాన్ని ఒబామా ఇందులో వివరించారు. 2010, 2015 సంవత్సరాల్లో అమెరికా అధ్యక్షుడిగా భారత్‌ను సందర్శించిన ఒబామా, భారత ఆర్థికరంగ రూపాంతర ప్రధాన శిల్పిగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను అభివర్ణించారు.
భారత్‌లో అభివృద్ధి..
భారతదేశం 1990ల్లో మార్కెట్ ఆధారిత ఆర్థికరంగం దిశగా ముందుకెళ్లిందని ఒబామా పేర్కొన్నారు. ఇది భారతీయుల్లో అసాధారణ వాణిజ్య, పారిశ్రామిక ప్రగతికి దోహదపడిందని వివరించారు. వృద్ధి రేటు బాగా పెరగడానికి.. సాంకేతిక రంగ అభివృధ్ధికి.. మధ్యతరగతి విస్తృతి నిదానంగా పెరగడానికి ఇది బాటలు పరిచిందని అభిప్రాయపడ్డారు.
ఆరాధ్యులు గాంధీజీ..
మహాత్మా గాంధీ తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశారని ఒబామా పేర్కొన్నారు. గాంధీజీ పట్ల తనకున్న అభిమానం, ఆరాధనను తాజా పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘నాకు భారత్ పట్ల మక్కువ కలగడానికి కారణం మహత్మా గాంధీ. అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలతో పాటు గాంధీజీ నా ఆలోచనల్ని ఎంతో ప్రభావితం చేశారు’’ అని ఒబామా పేర్కొన్నారు. గాంధీజీ పోరాటం కేవలం భారత్‌కు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేసిందని ఒబామా పేర్కొన్నారు. అమెరికాలో నల్లజాతీయులు తమ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటానికి ఇది దారి చూపిందన్నారు. 2010లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ముంబయిలోని గాంధీ నివాసం మణిభవన్‌లో గడిపిన క్షణాల్ని ఒబామా ఒకింత ఉద్వేగంతో ప్రస్తావించారు. చెప్పులు వదిలి తాము లోపలికి ప్రవేశించామని.. గాంధీజీ ఉపయోగించిన మంచం, చరఖాలు, పాతకాలపు ఫోన్, రాయడానికి ఉపయోగించిన బల్లను అలా చూస్తూ ఉండిపోయానని నాటి తన అనుభవాలను ఒబామా వివరించారు. "ఖాదీ ధోవతి ధరించి గోధుమ వర్ణంలో ఉన్న ఓ వ్యక్తి కాళ్లు ముడుచుకొని బ్రిటిష్ అధికారులకు లేఖ రాస్తున్నట్లు ఊహించుకునే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో నాకు ఆయన పక్కన కూర్చొని మాట్లాడాలనే బలమైన కోరిక కలిగింది. అత్యంత తక్కువ వనరులతో ఇంత బలం, స్ఫూర్తి ఎక్కడ నుంచి పొందారని అడగాలనిపించింది. నిరాశ నుంచి ఎలా కోలుకునేవారో తెలుసుకోవాలనిపించింది." అని ఒబామా పేర్కొన్నారు.
అందుకే పాక్ సాయం తీసుకోలేదు..
నాడు అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్‌పై అమెరికా జరిపిన దాడిలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని ఒబామా తెలిపారు. పాక్ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్, అల్‌ఖైదాతో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమేనని, అలాంటప్పుడు పాక్ నుంచి మద్దతు ఎలా ఆశిస్తామని ఒబామా అభిప్రాయపడ్డారు. లాడెన్ కోసం అమెరికా కమాండోలు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ గురించి ప్రస్తావించారు. " అబొట్టాబాద్‌లోని పాకిస్థానీ మిలిటరీ కంటోన్మెంట్ శివారులోని ఓ సురక్షిత ప్రాంతంలో లాడెన్ దాక్కున్నట్లు మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. లాడెన్‌పై దాడి చేయడానికి ఈ సమాచారం చాలనిపించి వెంటనే కార్యాచరణ మొదలుపెట్టాం. ఎలాంటి దాడి చేయగలమని టామ్ డోనిలన్ (అప్పటి జాతీయ భద్రత సలహాదారు), జాన్ బ్రెన్నన్ (అప్పటి సీఐఏ అధికారి)లను అడిగాను. అయితే లాడెన్‌పై మేం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని గోప్యంగా ఉంచడం మా ముందున్న సవాల్. ఎందుకంటే దీనిపై చిన్న సమాచారం బయటకు పొక్కినా గొప్ప అవకాశాన్ని కోల్పోతామని మాకు తెలుసు. అందుకే కేవలం ప్రభుత్వంలోని అతి తక్కువ మందికి మాత్రమే ఈ రహస్య ఆపరేషన్ గురించి తెలిసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశ ప్రభుత్వం మాకు సహకరిస్తున్నప్పటికీ పాక్ మిలిటరీలో కొన్ని అంతర్గత శక్తులకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు తాలిబన్, అల్‌ఖైదా ఉగ్రముఠాలతో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమే. కొన్నిసార్లు ఈ ముఠాలను ఆ దేశం భారత్, అఫ్గానిస్థాన్‌లపై వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బిన్‌లాడెన్ దాక్కున్న కాంపౌండ్ పాక్ మిలిటరీ కంటోన్మెంట్‌కు కేవలం కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది. ఈ ఆపరేషన్ గురించి పాకిస్థానీలకు ఏదైనా చెబితే లాడెన్‌కు సమాచారం అందే అవకాశం ఉంది. అందుకే పాకిస్థానీలను ఇందులో భాగస్వాములను చేయొద్దని గట్టిగా నిర్ణయించుకున్నాం. సమాచారమంతా సేకరించిన తర్వాత చివరగా మా ముందున్న రెండు అవకాశాల గురించి చర్చించుకున్నాం. మొదటిది - లాడెన్ ఉన్న కాంపౌండ్‌ను వైమానిక దాడులతో పూర్తిగా ధ్వంసం చేయాలి. రెండోది - ప్రత్యేక కమాండో ఆపరేషన్. ఇందులో కొంతమంది కమాండోలు హెలికాప్టర్ ద్వారా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి, దాడిచేసి, ఆ దేశ పోలీసులు, మిలిటరీ స్పందించకముందే అక్కడి నుంచి తిరిగి రావాలి. ఇబ్బంది ఉన్నప్పటికీ నేను, జాతీయ భద్రతా బృందం రెండో అవకాశాన్ని ఎంచుకున్నాం. ఈ ఆపరేషన్‌ను ఆమోదించడానికి ఒకరోజు ముందు సమావేశంలో హిల్లరీ క్లింటన్ (అప్పటి విదేశాంగ మంత్రి) మాట్లాడుతూ ఇందులో 51:49 నిష్పత్తిలో మాత్రమే ఫలితం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాబర్ట్ గేట్స్ కమాండో ఆపరేషన్‌ను వ్యతిరేకించి వైమానిక దాడులను పరిశీలిద్దామని చెప్పారు. ఇక ఉపాధ్యక్షుడు జో బైడెన్ కూడా వ్యతిరేకించారు. ఆపరేషన్ విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చివరకు నిఘావర్గాల నుంచి అత్యంత స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుని ఆపరేషన్ చేపట్టాం" అని ఒబామా తన పుస్తకంలో పేర్కొన్నారు. కమాండో ఆపరేషన్ విజయవంతమైన తర్వాత తర్వాత జాతీయ, అంతర్జాతీయ నేతల నుంచి అనేక ఫోన్లు వచ్చాయని, నాటి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఫోన్ చేసి అభినందించారని పేర్కొన్నారు. తన భార్య బెనజీర్ భుట్టో ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురవడాన్ని జర్దారీ గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారంటూ ఒబామా నాటి ఘటనలను వివరించారు.
" ఓ యువకుడిగా గాంధీ రచనలను అధ్యయనం చేస్తుంటే నాలోని లోతైన భావాలకు స్వరం ఇస్తున్నట్లు అనిపించేది. గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహం, సత్యనిష్ఠ, మనస్సాక్షిని కదిలించే అహింసామార్గం, మతపరమైన ఐక్యత, ప్రతిఒక్కరికీ సమాన గౌరవం దక్కేలా రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన ఏర్పాట్లు చేయాలన్న పట్టుదల నాలో ప్రతిధ్వనించేవి. ఆయన మాటల కంటే చేతలు నన్ను ప్రభావితం చేశాయి. జైలుకు వెళ్లడం, జీవితాన్నే పణంగా పెట్టడం, ప్రజా పోరాటాల్లో నిమగ్నమవడం ద్వారా ఆయన సిద్ధాంతాలకు ఆయనే పరీక్ష పెట్టుకునేవారు"