ఐక్యరాజ్యసమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా ప్రముఖ భారత ఆర్థికవేత్త లిజియా నోరోన్హా నియమితులయ్యారు. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు.
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) న్యూయార్క్ కార్యాలయ అధిపతిగానూ లిజియా నోరోన్హాను నియమించారు. స్థిర అభివృద్ధి రంగంలో ఆమెకు 30 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉందని ఐరాస ఓ ప్రకటనలో వెల్లడించింది. నైరోబిలో యూఎన్ఈపీ ఎకానమీ డివిజన్ డైరెక్టర్‌గానూ ఆమె సమర్థంగా పని చేశారని తెలిపింది.
ఐక్య రాజ్య సమితిలో చేరడానికి ముందు నోరోన్హా.. దిల్లీలోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆసియా ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ కార్యదర్శిగానూ ఆమె విధులు నిర్వర్తించారు. ముంబయి విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన నోరోన్హా.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఐక్యరాజ్య సమితిలో కీలక విభాగానికి భారత మహిళ ప్రాతినిధ్యం వహించనుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఇదీ చూడండి:'భారత్ నాయకత్వంలో ఆ లక్ష్యాలు సాధ్యమే'