ఓ వ్యక్తి గూగుల్ ఎర్త్ చూస్తుంటే ఓ చెరువులో ఏదో ఆకారం కనిపించింది. దానిని జూమ్ చేసి చూస్తే.. నీటిలో మునిగి ఉన్న కారు కనిపించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లను చెరువులోకి దింపారు. అందులో నిజంగానే కారు ఉంది. అంతేకాదు.. అందులో ఓ వ్యక్తి అస్థిపంజరమూ లభ్యమైంది.
ఇంతకీ ఆ శవం ఎవరిదీ? ఆ కారు చెరువులోకి ఎలా వెళ్లిందనే మిస్టరీని ఛేదించే క్రమంలో.. 22 ఏళ్ల కిందట మిస్టరీగా మారిన ఓ వ్యక్తి కేసు వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్‌లో జరిగిందీ ఘటన.
కనిపెట్టిన స్థిరాస్తి వ్యాపారి...
వివరాల్లోకి వెళ్తే... చార్లే ప్రాజెక్ట్ అనే సంస్థ అమెరికాలోని పరిష్కారం కాకుండా మిగిలిపోయిన మిస్టరీ కేసుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెడుతుంటోంది. ఇందులో భాగంగా గూగుల్ ఎర్త్ కేసును కూడా పేర్కొంది. ఆగస్టు 28న మూన్‌బేకు చెందిన ఓ ప్రాపర్టీ సర్వేయర్ గూగుల్ ఎర్త్‌లో ఆ ప్రాంతాన్ని సర్వే చేస్తుండగా కారు కనిపించింది. ఇప్పటివరకు దీన్ని ఎవరూ కనిపెట్టి ఉండకపోవచ్చు అని చార్లే ప్రాజెక్ట్ తమ నివేదికలో వెల్లడించింది.