ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్, రష్యాలు వైరస్ ప్రభావంతో విలవిలలాడుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 42,600 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో అధికం..
అమెరికాపై వైరస్ ఇంకా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్తగా 1300మందికి వైరస్ సోకింది. అయితే నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతితో చెలరేగిన నిరసనల వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్రరాజ్యంలో వైరస్ సోకిన వారి సంఖ్య 18,60,600కు పైగా ఉంది. ఇప్పటివరకు 1,06,944 మంది మహమ్మారి బారినపడి మరణించారు.
బ్రెజిల్లో సడలింపులు..
ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసుల్లో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో లాక్డౌన్ సడలింపులు చేపట్టారు అధికారులు. వైరస్ ప్రభావం దారుణంగా ఉన్నప్పటికీ సడలింపులు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మానౌస్, రియో డి జెనీరో నగరాలు కరోనాతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్రెజిల్లో 5,29,000 మంది వైరస్ బారిన పడగా 30,000 పైగా ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలో నిబంధనలు కఠినం
రష్యాలో కొత్తగా 8,800 మంది వైరస్ బారినపడ్డారు. 182మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 4,23,741 ఉండగా.. 5,037మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. కరోనా అనుమానితులు ఇంట్లోనే ఉన్నారని తెలిపే విధంగా ప్రభుత్వానికి ఫొటోలు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకవేళ అనుమానితులు ఇంటిని వీడితే 56 అమెరికన్ డాలర్ల జరిమానా చెల్లించాలని అదేశాలు జారీ చేశారు.