ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా వైరస్ పాపం చైనాదేనని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మరోసారి ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించే విధంగా చైనా ప్రచారం చేస్తోందని జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో విమర్శించారు.
"సమావేశంలో పాల్గొన్న ప్రతి జీ7 దేశానికి.... 'చైనా తన దేశంలో పుట్టిన కరోనా (వుహాన్) వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని' బాగా తెలుసు."
- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి
కరోనా భయాలతో ఇంతకుముందు పిట్స్బర్గ్లో జరగాల్సిన ఈ సమావేశాన్ని అమెరికా రద్దు చేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా బుధవారం గ్రూప్ ఆఫ్ సెవెన్ విదేశాంగ మంత్రులతో పాంపియో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్, చైనా సహా 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల (జీ-20 దేశాల) నాయకుల వీడియో కాన్ఫరెన్స్ శిఖరాగ్ర సమావేశానికి ఒక్కరోజు ముందు జీ-7 చర్చలు జరగడం గమనార్హం.
కుట్ర పన్నుతోంది!
ఈ మహమ్మారి గురించి చైనా 'తప్పుడు సమాచారాన్ని' ప్రచారం చేస్తున్నట్లు జీ-7 దేశాలు అంగీకరించాయని పాంపియో పేర్కొన్నారు. కరోనాను నియంత్రించేందుకు, శిథిలమైన ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించేందుకు బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సహా ప్రపంచ దేశాలతో కలిసి తాము పనిచేస్తామని పాంపియో స్పష్టం చేశారు.