అమెరికా అధ్యక్ష ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయని ప్రజలు విశ్వసించవచ్చని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత జార్జి డబ్ల్యూ బుష్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితం స్పష్టంగా ఉందని అన్నారు. అయితే ఏదైనా న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు, రీకౌంటింగ్ అడిగేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హక్కు ఉందని చెప్పారు.
అమెరికా ఎన్నికల్లో భారీగా ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేశారు బుష్. అమెరికా ప్రజాస్వామ్యానికి ఇదో శుభసూచిక అన్నారు.
"మీరు ఎలా ఓటేశారన్న విషయంతో సంబంధం లేదు. మీ ఓటు లెక్కలోకి వస్తుంది. ఈ ఎన్నికలు ప్రాథమికంగా సవ్యంగానే జరిగాయని, సమగ్రత నిలబడిందని, ఫలితం స్పష్టంగా ఉందని అమెరికన్ ప్రజలు విశ్వాసంతో ఉండవచ్చు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో బైడెన్-హారిస్ నుంచి ఉత్తమ పనితీరు కనబర్చడం అవసరం. దేశం కోసం మనందరం కూడా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. దేశ భవిష్యత్తు కోసం మనం ఒక్కతాటిపైకి రావాలి."
-జార్జి డబ్ల్యూ బుష్, అమెరికా మాజీ అధ్యక్షుడు
అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు బుష్. విజేతగా ప్రకటించిన తర్వాత జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశభక్తి సందేశాన్ని ఇచ్చినందుకు బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
"డెమొక్రటిక్ పార్టీ నుంచి గెలుపొందినా.. అమెరికన్లందరితో సమానంగా వ్యవహరిస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ పునరుద్ఘాటించారు. అధ్యక్షులు ట్రంప్, ఒబామాకు నేను ఏ హామీ ఇచ్చానో అదే ఆయనకు ఇస్తున్నాను. అవసరమైనప్పుడు ఏ విధంగానైనా సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆయన విజయాలు సాధించాలని నేను ప్రార్థిస్తాను."