టీకాలు వచ్చేశాయి! కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే వ్యాక్సిన్ అందరికీ అందడమే తరువాయి. అమెరికాలో చాలా మంది ఇప్పటికే రెండో డోసు కూడా పొందుతున్నారు. అయితే.. బ్రిటన్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కువ మందికి టీకా తొలి డోసును అందించాలన్న ఉద్దేశ్యంతో.. రెండో డోసు(బూస్టర్ డోసు)ను వాయిదా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 3-4 వారాల కాలవ్యవధిని 12 వారాలకు పెంచాలని వైద్యాధికారులు నిర్ణయించారు. వ్యాక్సిన్ల కొరతనే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఈ నిర్ణయంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఒక డోసుతో వైరస్ నుంచి రక్షణ లభిస్తుందా? డోసుల మధ్య వ్యవధి ఎక్కువైతే ఏమవుతుంది వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై వైద్యులు ఏమంటున్నారు.
రెండు డోసులతోనే సంపూర్ణ రక్షణా..?
వివిధ దేశాల్లో పలు టీకాలను అత్యవసర వినియోగం కోసం అనుమతించారు. అమెరికాలో ఫైజర్- జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన టీకాతో పాటుగా, మోడెర్నా టీకాకు అనుమతి లభించింది. బ్రిటన్‌లో ఫైజర్‌తో పాటుగా, ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాను అందిస్తున్నారు. మనదేశంలో భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాలకు ఇటీవలే డీసీజీఐ ఆమోదముద్ర వేసింది. ఈ టీకాలన్నీ రెండు డోసులతో వైరస్ నుంచి సంపూర్ణ రక్షణ అందిస్తాయని నిరూపితమయ్యాయి. మొదటి డోసు తీసుకున్న 3 లేదా 4 వారాల వ్యవధిలో రెండో డోసును తీసుకోవాల్సి ఉంటుంది.
రెండు డోసుల మధ్య ఎక్కువ సమయం తీసుకుంటే?
మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య 12 వారాల వ్యవధి ఏర్పడినా ఏమీ కాదని బ్రిటన్‌కు చెందిన వైద్యాధికారులు గత వారం నిర్ణయించారు. ఇలా బూస్టర్ డోసును వాయిదా వేయడం వల్ల ఎక్కువ మందిని వైరస్ నుంచి రక్షించగలుగుతామని వారు చెబుతున్నారు. రెండు డోసుల మధ్య ఈ స్వల్ప కాలవ్యవధి ఏర్పడితే.. దీర్ఘకాలంలో మంచిదేనని ఆస్ట్రాజెనెకా సంస్థ చేసిన ప్రచురితం కాని ఓ అధ్యయనం సూచిస్తోందని వారు అంటున్నారు. అయితే బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మొదటి డోసు తీసుకుంటే వైరస్ నుంచి రక్షణ లభించినట్టేనా?