విమానాల్లో ప్రయాణికుల మధ్య సీట్లలో ఖాళీ ఉంచడం వల్ల కరోనా వ్యాప్తి ముప్పు తగ్గుతుందని అమెరికాలో చేసిన ఓ పరిశోధన వెల్లడించింది. మాస్కు, ఫేస్‌షీల్డ్ వంటివి ధరించడం వల్ల వైరస్ బారిన పడే ప్రమాదం తగ్గుతుందని తేల్చింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలోనూ వివిధ దేశాల మధ్య పరిమిత సంఖ్యలో విమాన ప్రయాణాలను అనుమతిస్తున్నారు. అయితే, ప్రయాణ మార్గంలో విమాన ద్వారాలు, కిటికీలు పూర్తిగా మూసిఉంచడం, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండడం వంటి అంశాలు వైరస్ వ్యాప్తికి మరింత కారణమవుతున్నట్లు నిపుణులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాల్లో వైరస్ వ్యాప్తి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు(సీడీసీ)తో పాటు కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.
పరిశోధనలో భాగంగా వరుసలో మూడు సీట్లున్న విమానాల మోడల్‌ను రూపొందించారు. విమాన ప్రయాణికుల సామర్థ్యం పూర్తిగా ఉన్నప్పుడు.. ప్రయాణికుల మధ్య సీటు ఖాళీగా వదిలేసిన సందర్భాల్లో వైరస్ వ్యాప్తిని అంచనా వేశారు. పక్కపక్కనే కూర్చున్న ప్రయాణికులతో పోలిస్తే, ఇద్దరు ప్రయాణికుల మధ్య మధ్య సీటును ఖాళీగా వదిలేయడం వల్ల వైరస్ వ్యాప్తిని 23 నుంచి 57శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఇలా విమానాల్లో భౌతిక దూరం పాటించడం వల్ల కచ్చితంగా కొవిడ్ వ్యాప్తిని తగ్గించవచ్చని తాజా అధ్యయనం మరోసారి స్పస్టం చేస్తున్నట్లు సీడీసీ నిపుణులు వెల్లడించారు. సీట్ల మధ్య ఖాళీ వదలడం సహా మాస్కు, ఫేస్‌షీల్డ్ వంటివి ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. విమానాల్లో ఉండే ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువ ఆర్ద్రత వాతావరణంలో ఈ అధ్యయనం చేపట్టామని పరిశోధకులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఐరోపాలో 10 లక్షలు దాటిన కరోనా మృతులు