అమెరికాతో వాణిజ్య చర్చలపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేసింది చైనా. ఈ వారంలో జరిగే 11వ విడత చర్చల్లో పాల్గొననున్నట్టు డ్రాగన్ దేశం తెలిపింది. చైనా ఉత్పత్తులపై 200 బిలియన్ డాలర్ల మేర అదనపు పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పురోగతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటిజర్, ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ నుచిన్ ఆహ్వానం మేరకు ఈ నెల 9, 10వ తేదీల్లో వాషింగ్టన్లో జరిగే పదకొండో దఫా వాణిజ్య చర్చలకు చైనా ఉప ప్రధాని లియూ హి హాజరవుతారని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
"పరస్పర గౌరవం, ప్రయోజనాలే ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడానికి ముందడుగవుతుంది. సుంకాలు పెంచడం అనేది సమస్యను పరిష్కరించలేదు. రెండు వైపులా విభేదాలు ఉండటం సహజం. మేం వైరుధ్యాలను పక్కన పెడతాం. వారితో (అమెరికా) నిజాయితీగా సంప్రదింపులు కొనసాగించాలనే కోరుకుంటున్నాం."- జెంగ్ షువాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి