తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ అభిశంసనపై డెమొక్రటిక్​ పార్టీ మరో తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు అభిశంసన చిక్కులు మరింత తీవ్రమయ్యాయి. అధికార దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తును నిర్దేశించే తీర్మానాన్ని దిగువ సభలో ప్రవేశపెట్టింది ప్రతిపక్షం. ఈ చర్యను శ్వేతసౌధం తీవ్రంగా తప్పుబట్టింది.

ట్రంప్​ అభిశంసనపై డెమొక్రటిక్​ పార్టీ మరో తీర్మానం

By

Published : Oct 30, 2019, 6:23 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను గద్దె దించడమే లక్ష్యంగా కసరత్తు ముమ్మరం చేసింది ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ. అభిశంసనకు సంబంధించిన అధికారిక ప్రక్రియను నిర్దేశించే తీర్మానాన్ని దిగువ సభ ముందుకు తీసుకువచ్చింది. ప్రతిపక్షానికే మెజార్టీ ఉన్న దిగువ సభలో ఈ తీర్మానంపై గురువారం ఓటింగ్​ జరిగే అవకాశముంది.

ఏంటా తీర్మానం...?

ట్రంప్​ అభిశంసన వ్యవహారం ఉక్రెయిన్​-జో బిడెన్ వివాదంతో మొదలైంది. జో బిడెన్... డెమొక్రటిక్ పార్టీ నేత. 2020 అధ్యక్ష ఎన్నికల ఆశావహ అభ్యర్థి. రాజకీయ ప్రత్యర్థి అయిన జో బిడెన్​ను ఇరుకునపెట్టేందుకు ట్రంప్​ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ఆరోపణ. బిడెన్​పై వచ్చిన నిరాధార అవినీతి ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, విచారణ జరిపించాలని ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన అభియోగం.

ఈ ఆరోపణలపై ట్రంప్​ అభిశంసనకు ప్రయత్నిస్తోంది ప్రతిపక్షం. ఇప్పటికే 4 సభా సంఘాల ద్వారా 'ఉక్రెయిన్​పై ట్రంప్​ ఒత్తిడి'కి సంబంధించి విచారణ జరిపించింది. అందుకు కొనసాగింపుగా ఈ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకొచ్చింది.

"అభిశంసన విచారణలో విస్తృతమైన సాక్ష్యాలను దిగువ సభ​ సేకరించింది. అభిశంసనపై వాదనలను త్వరలో అమెరికా ప్రజలు సాక్షుల ద్వారా బహిరంగంగా వింటారు. సభా నిబంధనల​ కమిటీలో ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానం ఆ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళుతుంది.

2020 ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి విదేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఆధారాలనూ ఇప్పటికే సేకరించాం. గతంలోని విచారణను అనుసరించి తరువాతి దశ అత్యంత కీలకంగా, బహిరంగంగా జరుగుతుంది. అమెరికా ప్రజలు అధ్యక్షుడి దుష్ప్రవర్త గురించి ప్రత్యక్షంగా తెలుసుకుంటారు."

- సభా సంఘాల అధ్యక్షుల ప్రకటన

చట్ట విరుద్ధం...

ప్రతిపక్ష డెమొక్రటిక్​ పార్టీ తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శ్వేతసౌధం తప్పుబట్టింది. తీర్మానం చట్ట విరుద్ధమని పేర్కొంది.

ఇదీ చూడండి: ఇళ్లు ఖాళీ చేసి సినీ, క్రీడా ప్రముఖుల పరుగులు

ABOUT THE AUTHOR

...view details