కొవిడ్ టీకా తీసుకున్నవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు చాలా వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే కొవిడ్‌కు గురైన వారిలోనైతే, కరోనాకు వ్యతిరేకంగా అత్యంత బలమైన రోగనిరోధకశక్తి ఉంటున్నట్టు తేలింది. యేల్ విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ పరిశోధన వివరాలను 'నేచర్' పత్రిక అందించింది.
టీకాలు తీసుకున్న తర్వాత కరోనా సోకితే, వాటిని 'బ్రేక్‌త్రూ' కేసులుగా పరిగణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో అసలు వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయా? లేదా? అన్న సందేహం ఏర్పడింది. ఈ అంశంపై దృష్టి సారించిన పరిశోధకులు.. గత ఏడాది నవంబరులో అమెరికాకు చెందిన 40 మంది ఆరోగ్య సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. తర్వాత వారికి మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్లను రెండు డోసులుగా అందించారు. మొదటి, రెండో డోసు టీకా ఇచ్చిన తర్వాత కూడా వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం వాటిని డెల్టా సహా 16 రకాల వేరియంట్లపై ప్రయోగించి, యాంటీబాడీల స్థాయిని, టి-కణాల ప్రతిస్పందనను గమనించారు.