కరోనా వైరస్‌తో ప్రపంచం గడగడలాడుతోంది. ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. వైరస్‌ను కట్టడి చేయలేకపోతున్నాయి. అయితే ఓ బయో ఉగ్రవాద దాడి జరిగితే.. పరిస్థితులు ఎలా ఉంటాయో తాజా పరిణామాల నుంచి అవగాహన పొందొచ్చని అభిప్రాయపడ్డారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. దుష్ట శక్తులు ఇలాంటి వైరస్‌ను ఓ ఆయుధంగా ఉపయోగించుకునే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఈ మహమ్మారి ప్రపంచ దేశాల్లో ఉన్న బలహీనతలు, సంసిద్ధతలో ఉన్న లోపాలను బయటపెట్టింది. ఓ బయో ఉగ్ర దాడి జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులు చాలు. దుష్టశక్తుల చేతిలో ఇలాంటి వైరస్ పడితే.. ప్రపంచంలో విధ్వంసం తప్పదు."
-- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి.
ఉగ్రవాదుల నుంచి ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని గుటెరస్ అభిప్రాయపడ్డారు. మహమ్మారితో పోరాటానికి ప్రభుత్వాలు శ్రమిస్తుంటే.. ఇదే అదనుగా ముష్కరులు చెలరేగిపోయే అవకాశముందని హెచ్చరించారు.