తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​-19తో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పక్కా! - corona latest update

కరోనా వైరస్​తో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై కొవిడ్​-19 ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. వైరస్​ను నిరోధించడమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపే అంశాలపై దృష్టి సారించాలని ప్రభుత్వాలకు సూచించింది.

COVID-19
కొవిడ్​-19తో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు!

By

Published : May 21, 2020, 4:53 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారితో.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని పేర్కొంది ఓ అధ్యయనం. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలూ అధికమవుతాయని వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ఈ ప్రభావం మరింత ఎక్కువని స్పష్టం చేసింది.

అమెరికాలోని న్యూఓర్లిన్స్​కు చెందిన నిరుపేద మహిళలపై అధ్యయనం చేశారు యాలే స్కూల్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​కు చెందిన పరిశోధకులు. వారు సేకరించిన సమాచారం పీఎన్​ఏఎస్​ జర్నల్​లో ప్రచురితమైంది.

2005లో వచ్చిన కత్రినా తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన మహిళల ఆరోగ్యంపై దశలవారీగా పరిశీలన చేశారు పరిశోధకులు. తుపాను సంభవించిన తర్వాత తొలి ఏడాది.. ఆ తర్వాత 4, 12 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులను పరిశీలించారు. ఆ ఫలితాల ఆధారంగా మహిళలు మానసిక క్షోభ, శారీరక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు గుర్తించారు.

" కత్రినా తుపాను సమయంలో బాధాకరమైన అనుభవాలు ఎదురైనట్లు చాలా మంది మహిళలు వెల్లడించారు. వారు చెప్పిన అంశాలు ప్రస్తుత కొవిడ్​-19 పరిస్థితులకు సరిపోలి ఉన్నాయి. మరణాల ఉద్ధృతి, వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం, ఔషధాల కొరత వంటి విషయాలను ప్రస్తావించారు. వాటి కారణంగా స్వల్ప, దీర్ఘకాలిక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. గతంలో వచ్చిన కత్రినా విపత్తు కంటే ప్రస్తుత కరోనా ప్రభావం అధికంగా ఉంది."

– సారా లేవ్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్​

ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఆర్థిక నష్టాలు, నిరుద్యోగ సమస్యలను పరిశోధకులు ఈ అధ్యయనంలో చేర్చలేదు. కరోనా మహమ్మారిని నిరోధించటమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపే అంశాలపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలని పేర్కొన్నారు. వైద్య సంరక్షణ, ఔషధాల కొరతను తగ్గించటం ముఖ్యమైన విషయాలని అభిప్రాయపడ్డారు పరిశోధకులు. ప్రజలు భయాందోళనలు చెందకుండా అవగాహన కల్పించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details