అమెరికాలోని అట్లాంటా జూలో 13 గొరిల్లాలు కొవిడ్ బారినపడ్డాయి. ఇక్కడ సంరక్షణలో ఉన్న వెస్ట్రన్ లోల్యాండ్ గొరిల్లాల్లో కొన్ని దగ్గు, ముక్కు కారడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు నిర్వాహకులు గుర్తించారు. అనుమానంతో వాటి నుంచి నమూనాలను సేకరించి.. జార్జియా యూనివర్సిటీ ల్యాబ్‌కు పంపించగా రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.
వీటిల్లో ఎక్కువకాలం జీవించి ఉన్న.. 60 ఏళ్ల గొరిల్లా ఓజీ కూడా ఉంది. ప్రస్తుతం వాటికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూలో మొత్తం 20 గొరిల్లాలు(4 గుంపులుగా) ఉన్నాయి. ముందుజాగ్రత్తగా మిగతావాటన్నింటికీ కొవిడ్ టెస్టులు చేయనున్నట్లు వెల్లడించారు.
సిబ్బంది నుంచే..
గొరిల్లాల నిర్వహణ చూసే సిబ్బంది ఒకరి నుంచి.. వీటికి కరోనా సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ వ్యక్తి.. టీకా రెండు డోసులు తీసుకున్నాడని, క్రమంగా మాస్కులు, గ్లౌజులు ధరించేవాడని తెలిపారు.