కొవిడ్-19పై ప్రపంచం యుద్ధం చేస్తున్న తరుణంలో కొన్ని దేశాల్లోని ఆరోగ్య కార్యకర్తలు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రోబోలను ఉపయోగిస్తున్నారు. అలాంటి రోబోల విశేషాలివీ..
కాంతి పడితే వైరస్ భస్మమే..
వైరస్ జాపింగ్ రోబోగా పిలిచే ఈ యంత్రం ఆసుపత్రుల గదుల్లోకి దానంతట అదే వెళుతుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు దీని నుంచి అతినీలలోహిత కాంతి కిరణాలు వెలువడి అక్కడి ఉపరితలాలపై ఉన్న వైరస్‌ను నాశనం చేస్తాయి.
కాంతి పడితే వైరస్ భస్మమే.. టెలీ హెల్త్
5జీ సాయంతో పనిచేసే ఈ అత్యాధునిక రోబోల సహాయంతో మారుమూల ప్రాంతాల్లోని రోగుల వివరాలను కూడా ఆసుపత్రిలోనే కూర్చుని వైద్యులు విశ్లేషించొచ్చు. వైద్యసేవలు అందించవచ్చు.
ఆపన్న హస్తం
చైనా రాజధాని బీజింగ్‌లోని జిన్హువా విశ్వవిద్యాలయం దీనిని తయారు చేసింది. ఈ చెయ్యి ఉన్న గదిలో రోగిని పడుకోబెడతారు. ఆయన నోటి నుంచి స్వాబ్స్ సేకరించడం, అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లు చేయడం వంటి పనులను ఈ రోబో చేస్తుంది. అనంతరం ఆ సమాచారాన్ని వైద్యులు విశ్లేషించి రోగికి చికిత్సను నిర్ణయిస్తారు.
గస్తీ మిత్రుడు
ఈ రోబోను చైనా సంస్థ క్లౌడ్ మైండ్స్ తయారు చేసింది. ఆసుపత్రికి వచ్చిన సందర్శకుల ఉష్ణోగ్రత పరిశీలించడం, వారిని గుర్తించడంలో సహాయ పడడంతోపాటు రోగులు తిరిగిన ప్రాంతాలను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది.
భారత్‌లోనూ.. ప్రయోగాలు
- ఆసుపత్రులను శుభ్రం చేయడం, రోగులకు మందులు, ఆహారం సరఫరా చేయడం, వారి శరీర ఉష్ణోగ్రతలను నమోదుచేయడం వంటి పనులకు రోబోలను వినియోగించే దిశగా భారత్‌లో ప్రయోగాలు ఊపందుకున్నాయి.
- రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో ఉన్న స్వామీ మాన్‌సింగ్ ప్రభుత్వ ఆసుపత్రి తమ దగ్గర చికిత్స పొందుతున్న కొవిడ్-19 రోగులకు మందులు, ఆహారం అందజేసే పనులకు రోబోలను వినియోగించడంపై ప్రయోగపరీక్షలు నిర్వహిస్తోంది.
- కేరళకు చెందిన స్టార్టప్ అసిమోవ్ రోబోటిక్స్ ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న రోగులకు సహకరించేందుకు మూడు చక్రాల రోబోని తయారుచేసింది.
ఇదీ చదవండి:బీసీజీ టీకా కరోనాకు రక్షణ కవచమా?