చైనాలోని వుహాన్ కేంద్రంగా విశ్వ మహమ్మారికి కారణమైన కరోనా వైరస్... ఏడాది కాలంలో ఎన్నో మార్పులకు గురైంది. ముఖ్యంగా దాని కొమ్ములోని మాంసకృత్తు (స్పైక్ ప్రొటీన్) అనేక ఉత్పరివర్తనాలు చెంది, ప్రవర్తన కూడా మార్చుకుంది. అలా... వుహాన్ వైరస్‌కు భిన్నంగా ఇప్పుడు దక్షిణాఫ్రికా, బ్రిటన్, బ్రెజిల్ నుంచి కొత్తరకం కరోనా వైరస్‌లు పుట్టుకొచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని రకాలు రావచ్చు కూడా. మరి... వుహాన్ వైరస్‌ను లక్ష్యంగా చేసుకుని, శరీరంలో దాని యాంటీబాడీలను సృష్టించేలా పలు దేశాల్లో తయారైన వ్యాక్సిన్లు, ఔషధాలు కొత్తరకం కరోనా వైరస్‌లను నియంత్రిస్తాయా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సరిగ్గా ఈ అంశంపైనే అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఇటీవల పరిశోధన సాగించింది. ఇందులో వెల్లడైన పలు ఆసక్తికర విషయాలను నేచర్ మెడిసిన్ పత్రిక అందించింది.
సమర్థంగా నియంత్రించలేవా!
కొవిడ్-19 యాంటీబాడీల ఆధారంగా ఇప్పటివరకూ తయారైన వ్యాక్సిన్లు ఇతరత్రా ఔషధాలు... భవిష్యత్తు రకాల కరోనా వైరస్‌లను సమర్థంగా నియంత్రించలేకపోవచ్చని పరిశోధనకర్త మైఖేల్ ఎస్ డైమండ్ సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే... ఫైజర్ సంస్థ ఉత్పత్తి చేసిన కొవిడ్ టీకాను బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో కనిపిస్తున్న కొత్తరకం వైరస్‌లపై శాస్త్రవేత్తలు ప్రయోగించి చూశారు. "కరోనా టీకా వేయించుకున్న కొందరిలో యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి. వృద్ధులు, రోగ నిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారిలో అవి తగినంతగా పుట్టకపోవచ్చు. ఇలాంటి వారికి కొత్తరకం కరోనా వైరస్‌ల నుంచి పూర్తిస్థాయి రక్షణ ఉంటుందన్నది అనుమానమే.
అంతెందుకు... వుహాన్ వైరస్ బాధితుల్లో సహజంగా అభివృద్ధి చెందిన ప్రతినిరోధకాలు సైతం కొత్త వైరస్‌లను సమర్థంగా ఎదుర్కోలేకపోవచ్చు! ఫైజర్ వ్యాక్సిన్ వల్ల శరీరంలో ఉత్పత్తయిన యాంటీబాడీలు బ్రిటన్ రకం వైరస్‌ను సమర్థంగానే కట్టడి చేశాయి. కానీ... దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాల వైరస్‌లను సమర్థంగా ఎదుర్కోవాలంటే సహజ స్థాయికి 3.5 నుంచి 10 రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి కావాలి. ప్రస్తుత వ్యాక్సిన్లు అందరిలోనూ ఆ స్థాయిలో ప్రతినిరోధకాలను ఉత్పత్తి చేయగలవా? కొత్త వైరస్‌ల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించగలవా? అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త కరోనా వైరస్‌లను, వాటి యాంటీబాడీలను గమనిస్తూ... వ్యాక్సిన్లలో మార్పులు చేయడం, కొత్త టీకాలను అభివృద్ధి చేయడం ముఖ్యం" అని మైఖేల్ వివరించారు.
ఇదీ చదవండి :కొవిడ్ టీకాపై సంకోచమే అసలు సమస్య