కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇక వృద్ధులపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోన్న విషయం తెలిసిందే. అలాంటిది ఓ 70 ఏళ్ల పెద్దాయన మహమ్మారిని ఓడించి ఆరోగ్యంగా బయటకు వచ్చారంటే సంతోషం కలిగించే విషయమే కదా! ఇది వైరస్ సోకి కుంగిపోతున్న ఎంతో మందిలో స్ఫూర్తి నింపే అంశమే. ఇదంతా బాగానే ఉన్నా.. బయటకొచ్చి ఆస్పత్రి బిల్లు చూస్తే మాత్రం వారి గుండె ఝళ్లుమంది. ఏకంగా రూ.కోట్లలో వచ్చిన బిల్లును చూసి నిట్టూర్చడం వారి పనైంది. అయినా, వారు పెద్దగా బాధపడలేదు. కారణమేంటో చూడండి.
ఊహించని విధంగా..
అమెరికాలోని సియాటెల్ నగరానికి చెందిన మైఖేల్ ఫ్లోర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు మార్చి 4న ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహిస్తే కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వెంటనే చికిత్స ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం పూర్తిగా విషమించింది. వెంటలేటర్‌పై ఉంచారు. ఇక చివరి గడియలు సమీపించాయని అంతా అనుకున్నారు. అక్కడి నర్సులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి స్వయంగా పరామర్శించే పరిస్థితులు లేకపోవడంతో ఫోన్‌లోనే భార్యాపిల్లలతో మాట్లాడించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా తదుపరి రోజుల్లో ఆయన చికిత్సకు బాగా స్పందించారు. వైద్యులు సైతం ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా మెరుగైన సేవలందించారు. ప్రయత్నాలు ఫలించి ఆయన మహమ్మారిని జయించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 62 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.