భారత్ సహా పలు దేశాల కీలక సమాచారాలను అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ) దశాబ్దాలుగా సేకరిస్తోందని ఓ అమెరికన్ వార్తాపత్రిక ఆరోపించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ కంపెనీ సాయంతో వివిధ దేశాల రహస్య సందేశాలను అమెరికా చదువుతోందని తెలిపింది.
అనుసంధానం, సమాచార భద్రత కోసం క్రిప్టో ఏజీని 1940లో స్థాపించారు. తమ గూఢచారులు, సైనికులు, దౌత్య రహస్యాలను కాపాడేందుకు ఈ సంస్థ సేవలను చాలా దేశాల ప్రభుత్వాలు పొందుతున్నాయి. ఆయా రంగాల్లో సమాచారం కోసం వాడే కోడ్ సందేశాలను ఇతర దేశాలు చూడకుండా ఈ సంస్థ అడ్డుకుంటుంది. కానీ... ఈ సంస్థ ద్వారానే అమెరికా గూఢచర్యం సాగిస్తుందన్నది ప్రధాన ఆరోపణ.
అమెరికా సమాచార దోపిడీకి సంబంధించి వాషింగ్టన్ పోస్ట్‌తో పాటు జర్మన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్-జడ్‌డీఎఫ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. 1951లో క్రిప్టో ఏజీ అనే సంస్థతో సీఐఏ ఒప్పందం కుదుర్చుకుందని.. 70వ దశకంలో పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయని ఈ నివేదికలు వెల్లడించాయి.
"ఈ శతాబ్దంలో ఇది అతిపెద్ద నిఘా కుట్ర. అమెరికా, పశ్చిమ జర్మనీలకు తమ రహస్యాలు బయటకు రాకుండా విదేశీ ప్రభుత్వాలు చాలా మొత్తాన్ని చెల్లిస్తున్నాయి."