అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్వరలో జరగనున్న 13వ దఫా సంప్రదింపులకు చైనా ఉపప్రధాని లియూ హీ సహా ఉన్నతస్థాయి వాణిజ్య రాయబారి అమెరికా వెళ్లనున్నట్లు డ్రాగన్ దేశం ప్రకటించింది.
సమావేశాలు జరిగే తేదీలు ప్రకటించనప్పటికీ.. చైనా జాతీయ దినోత్సవం అయిన అక్టోబర్ 7 అనంతరమే చర్చలు ఉంటాయని చైనా వాణిజ్య శాఖ సహాయ మంత్రి వాంగ్ షూవెన్ పేర్కొన్నారు.
"పరస్పర గౌరవం, సమానత్వం, ఇరు దేశాలకూ ప్రయోజనం అనే సూత్రం ఆధారంగా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలి."
-వాంగ్ షూవెన్, చైనా మంత్రి
చైనా నుంచి రాయితీలు పొందాలన్న లక్ష్యంతో డ్రాగన్ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలను పెంచారు ట్రంప్. బదులుగా జిన్పింగ్ సర్కారు కూడా అమెరికా వస్తువులపై పన్ను రేట్లు పెంచింది.
రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.
ఈ దఫా చర్చలకు ముందు ఇరుదేశాలు సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ... ఒప్పందం కుదురుతుందా లేదా అనే అంశమై సందిగ్ధత నెలకొంది.
ఇదీ చూడండి: దారికి అడ్డొచ్చిన ఆవులు- ఐదుగురు మృతి