భారత ఎదుగుదల తనకు ఇబ్బందిగా మారుతుందని చైనా భావిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. తన లక్ష్యాలను చేరుకోకుండా భారత్ అడ్డుపడుతుందని చైనా భయపడతోందని తెలిపింది. అందుకే భారత్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చైనా చూస్తోందని ఓ నివేదికలో స్పష్టం చేసింది.
బైడెన్- ట్రంప్ అధికార మార్పిడి ప్రక్రియలో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ.. ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలను చైనా లెక్కచేయడం లేదని ప్రధానంగా ఆరోపించింది.
"అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సహా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్ పెంచుకుంటున్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చైనా ప్రయత్నిస్తోంది. సరిహద్దుల్లో రెచ్చగొట్టి లాభపడాలని చూస్తోంది. తన పొరుగున ఉన్న దేశాలు, ముఖ్యంగా ఆసియాన్ దేశాల భద్రత, స్వయం ప్రతిపత్తి, ఆర్థిక వ్యవస్థను అణగదొక్కాలని యోచిస్తోంది. ఆసియా దేశాల్లో అమెరికా ప్రభావాన్ని తగ్గించి తన ఆధిపత్యం చలాయించాలని వ్యూహాలు రూపొందిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలని కుట్రలు పన్నుతోంది."
- అమెరికా విదేశాంగ నివేదిక