తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత సరిహద్దులో 60 వేల మంది చైనా సైనికులు'

భారత ఉత్తర సరిహద్దుల వద్ద చైనా 60 వేల మంది సైనికులను మోహరించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. చైనా తన చెడు ప్రవర్తనతో క్వాడ్‌ గ్రూపు దేశాలపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

China has deployed 60K soldiers on India's northern border: Pompeo
'భారత సరిహద్దులో 60 వేల మంది చైనా బలగాలు మోహరింపు'

By

Published : Oct 10, 2020, 10:54 AM IST

Updated : Oct 10, 2020, 11:35 AM IST

క్వాడ్​ దేశాల పట్ల చైనా దురుసు ప్రవర్తనను తప్పుబట్టారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. అమెరికా, జపాన్​, భారత్​, ఆస్ట్రేలియాలను బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.

భారత ఉత్తర సరిహద్దులో చైనా.. దాదాపు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని ఆయన అన్నారు. ఇటీవల టోక్యోలో జరిగిన క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొని అమెరికా తిరిగి వెళ్లిన పాంపియో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి:చతుర్ముఖ కూటమి విదేశాంగ మంత్రుల భేటీ

''ఉత్తర సరిహద్దులో చైనాకు చెందిన దాదాపు 60 వేల మంది సైనికుల్ని.. భారత సైన్యం గుర్తించింది. క్వాడ్​ .. నాలుగు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు, నాలుగు శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలు.. వీటన్నింటికీ చైనా కమ్యూనిస్ట్​ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉంది. భారత్​, జపాన్​, ఆస్ట్రేలియాలోనూ చైనా దుందుడుకు చర్యలను గమనించవచ్చు.''

- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

కరోనా వైరస్‌ జన్మస్థలంపై దర్యాప్తు జరగాలని ఆస్ట్రేలియా అడిగినప్పుడు.. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ వారిని కూడా బెదిరించిందన్నారు పాంపియో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలో ఓ కూటమి ఏర్పాటైందని.. నియంతృత్వ దేశాలు కాకుండా ప్రజాస్వామ్య దేశాలే ప్రపంచాన్ని నడిపే విధంగా ఆ కూటమి రూపొందిందన్నారు.

చైనానే లక్ష్యంగా..

భారత దేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా.. వీటిని క్వాడ్​ దేశాలు అంటారు. ఈ దేశాల విదేశాంగ మంత్రులు జపాన్​లోని టోక్యోలో మంగళవారం సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్​ ప్రాంతం, వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ), దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాల్లో.. డ్రాగన్​ బలగాల మోహరింపుపైనే ప్రధానంగా చర్చించారు.

స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ నిర్మాణం కోసం సమష్టిగా కృషి చేయాలని క్వాడ్ సభ్య దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఓ అంగీకారానికి వచ్చాయి. భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్​ కూడా విడిగా పాంపియోతో భేటీ అయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత కోసం సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం జైశంకర్ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదీ చూడండి:'స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ నిర్మాణమే లక్ష్యం'

Last Updated : Oct 10, 2020, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details