Capitol Attack Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికా క్యాపిటల్ భవనంపై గతేడాది జనవరి 6న దాడిపై.. దర్యాప్తు చేస్తున్న హౌస్ కమిటీ కీలక విషయాలు వెల్లడించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ ధ్రువీకరించకుండా ట్రంప్, ఆయన అనుచరులు 'నేరపూరిత కుట్ర'కు పాల్పడ్డారని తెలిపింది. దీని గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారని, ఫలితాలను తారుమారు చేసేందుకు అధికారులపై ఒత్తిడి చేశారని ఆధారాలు ఉన్నట్లు వెల్లడించింది.
ట్రంప్ సలహాదారు జాన్ ఈస్ట్మన్ వేసిన వ్యాజ్యంపై కమిటీ ఈ విధంగా స్పందించింది. డొనాల్డ్ ట్రంప్.. ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించినట్లు, కాంగ్రెస్ను అడ్డుకొని.. అమెరికాను మోసం చేసినట్లు నమ్ముతున్నామని విచారణ కమిటీ పేర్కొంది.
ఇదీ జరిగింది..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు చేపట్టిన కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి నెల 6న చేపట్టిన ఆందోళన హింసాత్మతంగా మారింది. సమావేశానికి వేదిక అయిన క్యాపిటల్ భవనంలోకి నిరసనకారులు బారికేడ్లు తోసుకుంటూ చొచ్చుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల కళ్లలో రసాయనాలు చల్లి వారితో ఘర్షణకు దిగారు. పోలీసులు కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి పలు కమిటీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ దుశ్చర్యకు సంబంధించి అమెరికా న్యాయశాఖ దాదాపు 700 మందిపై అభియోగాలు మోపింది.
ఇదీ చూడండి:అధికారం కోసం ట్రంప్ అంతకు తెగించారా?.. వెలుగులోకి ఆసక్తికర ఆధారం!