వచ్చే కొన్నినెలల్లోనే కరోనా మహమ్మారిని అదుపులోకి తేవడం ప్రపంచ దేశాలకు సాధ్యమని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ప్రపంచ దేశాలు నిష్పక్షపాతంగా వినియోగించుకోవడం ఎంతో అవసరమని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ.. మహమ్మారిపై ప్రపంచ దేశాలు కలిసిపోరాడాలని పిలుపునిచ్చింది.
"కొన్ని నెలల్లోనే కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రణలోకి తెచ్చేందుకు పలు మార్గాలున్నాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనరులను అన్ని దేశాలు నిష్పక్షపాతంగా వినియోగించుకుంటే ఇది కచ్చితంగా సాధ్యమవుతుంది."
-టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్
కొంతకాలంగా కరోనా వైరస్ ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో పెరగడం పట్ల డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 25 నుంచి 59ఏళ్ల మధ్య వయసు వారిలోనూ వైరస్ వ్యాప్తి చెందుతోందని.. ఇందుకు తీవ్రత ఎక్కువగా ఉన్న కొత్తరకాలే కారణమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయానికి 10లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి 7నెలల సమయం పడితే, మరో నాలుగు నెలల్లోనే ఆసంఖ్య 20లక్షలకు చేరింది. ఆ తర్వాత మరో మూడు నెలల్లోనే కరోనా మరణాల సంఖ్య 30లక్షలకు చేరడం ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ పేర్కొన్నారు.