Bolsonaro vaccine news: బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో చిక్కుల్లో పడ్డారు. కరోనా టీకాలు, ఎయిడ్స్‌కు ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలెగ్జాండర్ డీ మోరేస్.. ప్రాసిక్యూటర్ అగస్టో ఆరస్కు సూచించారు.
అక్టోబర్ 24న మీడియాతో మాట్లాడుతూ.. "పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు.. ఎయిడ్స్ బారినపడే ముప్పు ఎక్కువగా ఉందని బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన నివేదికలో బయటపడింది," అని బొల్సొనారో అన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వెంటనే ఆ వీడియోను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు తొలగించాయి.
అయితే అధ్యక్షుడిపై దర్యాప్తు జరగడం ప్రశ్నార్థకమే. కరోనా మహమ్మారి నిర్వహణలో బొల్సొనారోపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణ జరపాలని సెనేట్ కమిటీ అనేకమార్లు డిమాండ్ చేసింది. వాటిని ఆరస్ పట్టించుకోలేదు.