లద్దాఖ్‌లో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా అమెరికా నుంచి భారత్‌కు బలమైన మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ చట్టసభలతో పాటు అగ్రరాజ్యంలోని ఇరు పార్టీ నేతలు చైనా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు.
గత కొన్ని వారాలుగా ప్రతినిధుల సభతో పాటు పెద్దల సభ సెనెట్‌లో భారత్‌కు సంఘీభావంగా సభ్యులు వ్యాఖ్యలు చేశారు. చైనా దూకుడును ఎంగడట్టిన ఉభయ సభల ప్రతినిధులు.. భూభాగాలను స్వాధీనం చేసుకోవాలన్న డ్రాగన్ ప్రయత్నాలకు దృఢంగా నిలబడిందని భారత్‌ను ప్రశంసించారు. పార్లమెంట్ వెలుపలా మద్దతు లభిస్తుండటం గమనార్హం.
"చైనా తన సైనిక దూకుడును అంతం చేయాలి. ఈ సంఘర్షణ శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకోవాలి. ఘర్షణ జరిగిన నెలలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.. 5 వేల మంది సైనికులను సరిహద్దుకు తరలించింది. ఇదంతా.. దుందుడుకు వైఖరితో దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దును మార్చేందుకేనని అర్థమవుతోంది."
- ఫ్రాంక్ పాల్లోన్, సీనియర్ డెమోక్రటిక్ నేత, ప్రతినిధుల సభలో సభ్యుడు
పార్టీలకతీతంగా..
అగ్రరాజ్యంలో ఓవైపు రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ మధ్య బాహాబాహీ జరుగుతున్నప్పటికీ.. భారత్ విషయానికొస్తే రెండు పార్టీల నేతలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. ట్వీట్లు, బహిరంగ ప్రసంగాలతో పాటు చట్ట సభల వేదికగా భారత్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. భారత ప్రధానితో పాటు అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్ సంధుకి లేఖలు రాస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ శాసనకర్తలతో ప్రతీరోజు వర్చువల్ సమావేశంలో పాల్గొంటున్నారు సంధు. చైనా వ్యతిరేక గళం వినిపిస్తూ కొంతమంది శాసనకర్తలు సంధుకి ఫోన్లు చేశారు.
జడిసేది లేదు
వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికుల మరణంపై రిపబ్లికన్ సెనెటర్ కోరీ గార్డనర్ విచారం వ్యక్తం చేశారు. ఇటీవల రాయబారి సంధుతో మాట్లాడిన ఆయన.. ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని సవాళ్లను సంయుక్తంగా ఎదురుకోవడంపై చర్చించారు.