తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ బీచ్​లో పందులే ప్రత్యేక ఆకర్షణ - bahamas pigs in sea

అది బహమాస్​ దేశంలోని ఓ ద్వీపం. అక్కడ మనుషులెవ్వరూ ఉండరు. కానీ పందులు మాత్రం వీరవిహారం చేస్తాయి. నీటిలో ఈత కొడతాయి. పర్యటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అయితే, ఈ ఐలాండ్‌కు పందులెలా వచ్చాయో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కట్లేదు.

pigs story
అక్కడకు వరాహాలు ఎలా వచ్చాయబ్బా?

By

Published : Nov 5, 2020, 1:34 PM IST

బహమాస్‌ దేశం దీవుల సమూహం. ఏటా లక్షల మంది పర్యటకులు ఇక్కడి ఐలాండ్స్‌ను సందర్శించేందుకు వస్తుంటారు. ఆ దేశ జీడీపీలో సగభాగం పర్యటక రంగానిదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అందమైన ఐలాండ్స్‌, ఆకట్టుకునే ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు పర్యటకులను బాగా ఆకర్షిస్తాయి. అయితే ఇక్కడి ఐలాండ్స్‌లో కొన్ని జనావాసాలు కాగా.. మరికొన్నింట్లో జనసంచారం ఉండదు. ఇలాంటి నిర్మానుష్య ఐలాండ్స్‌లో ఒకటి చాలా కాలంగా పర్యటకులను తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఆ ఐలాండ్‌ మొత్తం పందులే ఉన్నాయి. దీంతో ఆ ఐలాండ్‌ను 'పిగ్స్‌ బీచ్‌'గా పిలుస్తున్నారు. బీచ్‌లో ఆటలాడుతూ.. ఈత కొట్టే పందులను చూసేందుకు పర్యటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

పర్యటకులకు ఆకర్షణ ఈ పందులే!

ఎలా వచ్చాయి?

అయితే, ఈ ఐలాండ్‌కు పందులెలా వచ్చాయో ఇప్పటికీ ఎవరికి అంతుచిక్కట్లేదు. కానీ, పలు వాదనలు వినిపిస్తున్నాయి. పూర్వం కొందరు నావికులు మార్గమధ్యంలో ఈ ఐలాండ్‌కు వచ్చి పందుల్ని వదిలేశారట, తిరుగు ప్రయాణంలో వీటిని ఇక్కడే వండుకొని తిని వెళ్లొచ్చని భావించారట. కానీ, వాళ్లు తిరిగి రాకపోవడంతో పందులు ఇక్కడే ఉండిపోయాయని, పిల్లల్ని కని వాటి సంఖ్యను పెంచుకున్నాయని అంటున్నారు. మరికొందరు ఈ దీవి సమీపంలో ఏదైనా ఓడ ప్రమాదానికి గురై ఉంటుందని, ఆ ఓడలో ఉన్న పందులే ఈదుకుంటూ ఇక్కడకు చేరి ఉంటాయని చెబుతున్నారు. నావికులు ఈ మార్గం గుండా వెళ్తూ పారేసిన ఆహారాన్ని తింటూ జీవిస్తున్నాయని భావిస్తున్నారు. ఇంకొందరు బహమాస్‌ ప్రభుత్వమే పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా పందుల్ని ఆ ఐలాండ్‌లో వదిలిపెట్టి ఉంటుందని వాదనలు వినిపిస్తున్నారు. అయితే వీటిలో ఏది నిజమనేది నిర్ధరణ కాలేదు. ఈ పందులు ఎలా వచ్చాయనే దానికన్నా.. వాటి వల్ల పర్యటకుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని అక్కడి ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ బీచ్.. వరాహాల ఈత కొలను!

అలా ఈ పిగ్స్‌ బీచ్‌లో ప్రస్తుతం 20కిపైగా పందులు ఎంతో విలాసవంతంగా బతికేస్తున్నాయి. సందర్శకులు, ఇరుగుపొరుగు దీవుల్లో ఉండే స్థానిక ప్రజలు రోజూ వీటికి ఆహారం అందిస్తున్నారు. ఆ తిండి తింటూ ఐలాండ్‌ మొత్తం తిరుగుతూ.. సముద్రంలో ఈత కొడుతూ పందులు జల్సా చేస్తున్నాయి. వాటిని చూసి పర్యటకులు మురిసిపోతున్నారు.

పందుల సవారీ

ABOUT THE AUTHOR

...view details