అమెరికా నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న జోబైడెన్ ప్రమాణ స్వీకార రిహార్సల్ కార్యక్రమం వాయిదా పడింది. సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించాలని తొలుత భావించగా.. భద్రతా సమస్యల దృష్ట్యా దీన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ(ఎఫ్‌బీఐ) హెచ్చరించింది. అమెరికాలోని 50 రాష్ట్రాల రాజధానుల్లో, వాషింగ్టన్ డీసీలో నిరసనకారులు ఆయుధాలతో అల్లర్లకు పాల్పడే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రిహార్సల్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అమెరికాలోని మీడియా సంస్థలు చెబుతున్నాయి.
భద్రతా సమస్యలు కారణంగా.. విల్లింగ్టన్ నుంచి వాషింగ్టన్ వరకు బైడెన్ బృందం నిర్వహించ తలపెట్టిన ఆమ్త్రాక్ యాత్ర కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారులెవరూ ఇంతవరకు స్పందించలేదు.
పటిష్ఠ బందోబస్తు..
ప్రమాణస్వీకార మహోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకునేందుకు 20వేల మంది నేషనల్ గార్డ్స్‌ను ఆయుధాలతో క్యాపిటల్ చుట్టూ మోహరిస్తోంది అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్. ఇప్పటికే 15 వేల మంది క్యాపిటల్ వద్దకు చేరుకున్నారు. ఈ నెల 20లోపు మరో 5వేల మంది వేదిక ప్రాంగణం వద్దకు చేరుకుంటారు.
100కు పైగా మంది అరెస్టు..
జనవరి 6న జరిగిన అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో పాల్గొన్న 100కు పైగా వ్యక్తుల్నిఅరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫరక్ రే చెప్పారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో రే సమావేశమయ్యారు. ఇలాంటి చర్యలకు పాల్పడాలనుకునే వారికి ఈ అరెస్టులు ఓ హెచ్చరికలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.