కొవిడ్-19ను కట్టడి చేయటమే తమ తొలి ప్రాధాన్యంగా ప్రకటించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. అధికార పగ్గాలు చేపట్టేలోపే కరోనా అత్యవసర సాయం కింద నిధులకు కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయించాలని పట్టుదలతో ఉన్నారు. కొద్ది రోజుల్లో జరగనున్న 'లేమ్-డక్ సెషన్'( కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత.. అధికారం చేపట్టేలోపు కాంగ్రెస్ భేటీ)లో ఈ ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం లభించేలా చూడాలని సెనేట్, ప్రతినిధుల సభల్లోని పలువురు సీనియర్ డెమొక్రటిక్ సభ్యులతో సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి స్పీకర్ నాన్సీ పెలోసీ, సెనేట్ డెమొక్రటిక్ నాయకుడు చక్ షుమెర్లతో నేరుగా భేటీ అయ్యారు బైడెన్. మరో కరోనా సాయం బిల్లుకు ఆమోదం పొందేందుకు బైడెన్ కొత్త పరిపాలన విభాగం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ పంపిణీకి సమగ్ర ప్రణాళికను రూపొందించింది.
" లేమ్-డక్ సెషన్లో బహుళ ప్రయోజన అత్యవసర సహాయ ప్యాకేజీకి కాంగ్రెస్ తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సిన అవసరం ఉందని మా బృందం అంగీకరించింది. ఇందులో కొవిడ్‌పై పోరాటానికి కావాల్సిన వనరులు, కార్మిక కుటుంబాలు, చిన్న వ్యాపారాలకు ఉపశమనం, క్షేత్రస్థాయి సిబ్బందిని విధుల్లో ఉంచేందుకు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు మద్దతు, నిరుద్యోగ బీమా పొడగింపు, లక్షలాది కుటుంబాలకు సరసమైన వైద్య సదుపాయల కల్పన ఉండాలి."