తాలిబన్ ఆక్రమిత అఫ్గానిస్థాన్(Afghanistan Taliban) నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ పొడగింపుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 31 తర్వాత కూడా ఈ ప్రక్రియను కొనసాగించడంపై సైనికాధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదివారం ఆయన శ్వేతసౌధంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
"అఫ్గాన్ నుంచి ప్రజల తరలింపు ప్రక్రియను ఆగస్టు 31 తర్వాత కూడా కొనసాగించడంపై అమెరికా సైనికాధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియను ఇంకా మేం పొడగించాల్సిన అవసరం లేదు. కానీ, దీనిపై చర్చలైతే జరుగుతున్నాయి. ఇది ఎంతదూరం వెళ్తుందో నాకు తెలియదు."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
"అఫ్గాన్‌లో పరిస్థితిని ఆసరాగా చేసుకుని అఫ్గాన్ పౌరులు, అమెరికా బలగాలే లక్ష్యంగా ఉగ్రమూకలు తెగబడే అవకాశం ఉందని మాకు తెలుసు. ఐసిస్, ఐసిస్-కె వంటి ఉగ్రసంస్థల నుంచి ఇలాంటి ముప్పు ఎదురుకాకుండా ఉండేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం." అని బైడెన్ (Joe Biden Afghanistan) పేర్కొన్నారు. కాబుల్ విమానాశ్రయం(Kabul airport) చుట్టుపక్కల సురక్షిత వాతావరణం ఉండేలా తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
'ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?'
ఈ తరలింపు ప్రక్రియ.. బాధ, నష్టం లేకుండా సాధ్యం కాదని బైడెన్ చెప్పారు.